Kerala Cricket League
Kerala Cricket League : కేరళ క్రికెట్ లీగ్ (Kerala Cricket League) 2025లో భాగంగా.. ఆదివారం తిరువనంతపూర్‌లో అరైస్ కొల్లాం సైలర్స్, కొచ్చి బ్లూ టైగర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కొల్లం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ఆ తరువాత 237 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు ఓపెనర్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన ఆటతీరును కనబర్చాడు. సంజూ కేవలం 42 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. అయితే, చివరిలో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది.
దూకుడుగా ఆడుతున్న సంజూ శాంసన్‌ను కొల్లాం పేసర్ బిజు నారాయణన్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తరువాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. దీంతో చివరి ఓవర్లో కొచ్చి జట్టు విజయానికి 17 పరుగులు అవసరం అయ్యాయి. ఆ సమయంలో కొచ్చి బ్యాటర్ మహమ్మద్ ఆషిక్ అద్భుతం చేశాడు. తొలి రెండు బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టాడు. ఫలితంగా నాలుగు బంతుల్లో ఏడు పరుగులు అవసరం ఉంది.
మిగిలిన రెండు బంతుల్లో రెండు పరుగులు వచ్చాయి. దీంతో రెండు బంతుల్లో ఐదు పరుగులు కొట్టాల్సి ఉంది. ఐదో బంతికి పరుగు రాకపోవడంతో ఒక్క బంతికి ఆరు పరుగులు అవసరం ఉంది. క్రీజులో ఆషిక్ ఉన్నాడు. చివరి బంతికి సిక్స్ కొట్టి ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కొచ్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో కొచ్చి జట్టు విజయోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి.
6 WAS NEEDED ON THE FINAL BALL AND SIX IT WAS TO WIN IN KCL. 🔥pic.twitter.com/b9lrQMEWti
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 25, 2025
121 పరుగులు చేసిన సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ టోర్నీలో కొచ్చి జట్టు మూడు మ్యాచ్‌లలో విజయాల పరంపరను కొనసాగించింది. ఇదిలాఉంటే.. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.
ఈ టోర్నీలో భారత్ జట్టు తరపున ఓపెనర్లుగా ఎవరెవరు క్రీజులోకి వస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా క్రీజులో వస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా కేరళ క్రికెట్ లీగ్ లో సంజూ శాంసన్ అద్భుత సెంచరీతో రాణించడంతో ఆసియా కప్ లో ఓపెనర్ల విషయంలో శుభ్ మన్ గిల్ కు సంజూ గట్టిపోటీ ఇచ్చినట్లైంది. దీంతో సెలక్టర్లకు ఆసియా కప్ భారత జట్టులో ఓపెనర్లను ఎంపిక చేయడం కష్టంగా మారిందని చెప్పొచ్చు.