అందుకే అప్పుడు ఐపీఎల్‌ మ్యాచులపై దృష్టి నిలపలేకపోయాను: కేకేఆర్ వైస్ కెప్టెన్‌ వెంకటేశ్‌ అయ్యర్

వెంకటేశ్ అయ్యర్‌ని తిరిగి దక్కించుకోవడానికి కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.23.75 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించింది.

ఐపీఎల్‌ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వైస్-కెప్టెన్‌గా వెంకటేశ్‌ అయ్యర్ నియమితుడైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2020లో అద్భుతంగా రాణించిన తర్వాత.. 2021 టీ20 వరల్డ్ కప్‌లో అతడు టీమిండియాలో స్థానం సంపాదించాడు. ఐపీఎల్ 2022లో అయ్యర్ పెద్దగా అనుకున్నంత ప్రభావం చూపించలేకపోయాడు. దాంతో 9 టీ20లు, 2 వన్డేలు ఆడిన తర్వాత భారత జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

అయితే, అయ్యర్ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు. జాతీయ జట్టులో చోటు సంపాదించలేదు కానీ, ఐపీఎల్‌లో మాత్రం కేకేఆర్‌లో అత్యంత నమ్మకమైన బ్యాటర్‌గా మారాడు. ఐపీఎల్‌ 2023లో 145.85 స్ట్రైక్ రేట్‌తో 404 పరుగులు చేశాడు. 2024లో 158.80 స్ట్రైక్ రేట్‌తో 370 పరుగులు చేశాడు. 2023లో బ్రెండన్ మెకల్లమ్ తర్వాత ఐపీఎల్‌లో సెంచరీ చేసిన కేకేఆర్ ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. 2025 మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్‌ని తిరిగి దక్కించుకోవడానికి కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.23.75 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించింది.

వైస్-కెప్టెన్‌గా ఎదిగిన తన జర్నీ గురించి అయ్యర్ మాట్లాడుతూ.. “2022లో టీ20 వరల్డ్‌కప్ జట్టులో నేను ఉంటానని అతిగా ఆలోచించటం వల్ల ఐపీఎల్‌ మ్యాచెస్‌పై దృష్టి నిలపలేకపోయాను. చివరికి, రెండింటినీ కోల్పోయాను. అది నాకు గుణపాఠం. అప్పట్లో గాయంతో 6-8 నెలలు ఆటకు దూరంగా ఉండటంతో ఐపీఎల్‌ ఎంత ముఖ్యమో అర్థమైంది. మనకు లభించినది ఆనందంగా తీసుకోవాలి. ఇవి నా మాటలు కాదు.. ఇవి షారుఖ్ ఖాన్ చెప్పిన మాటలు” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Also Read: ఈ చిత్ర పరిశ్రమకు మరీ ఇన్ని కోట్ల నష్టం రావడం ఏంటి?

“ఐపీఎల్ 2025 వేలం నా జీవితంలో మార్పు తీసుకొచ్చింది. మిడిల్ క్లాస్ వ్యక్తిగా, వేలంలో నాకు దక్కిన డబ్బు పట్ల ఎంతో సంబరపడ్డాను. కానీ వేలంలో కేకేఆర్, ఆర్సీబీ పోటీ చూసినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను. ఇది నా కెరీర్‌లో నేనేం సాధించానో తెలిసిన క్షణం. కానీ, ఇది పెద్ద బాధ్యత కూడా. ఒత్తిడి లేదని చెబితే అబద్ధమే. ఒత్తిడి ఉండాల్సిందే. కానీ మ్యాచు ప్రారంభమైన తర్వాత, అది రూ.20 లక్షల ఆటగాడైనా, రూ.20 కోట్ల ఆటగాడైనా పని మాత్రం ఒకటే” అని అయ్యర్ పేర్కొన్నాడు.

“ఈడెన్ గార్డెన్స్‌లో ఆడటం నాకు దేవాలయంలో అడుగుపెట్టినంత ఆనందంగా ఉంటుంది. 70-80 వేల మంది నా వెనుక నిలబడి మద్దతు ఇస్తుంటే, ఆ ఎనర్జీ నా ఉత్తమ ప్రతిభను బయటకు తీయడంలో సహాయపడుతుంది,” అని అయ్యర్ భావోద్వేగంగా చెప్పాడు.

“షారుఖ్ ఖాన్ ఫ్రాంచైజ్ ఓనర్ లా కాకుండా ఒక అన్నలాంటి అనుభూతి కలిగిస్తాడు. అతను ఎప్పుడూ మనతో ఉంటాడనే భరోసా కలిగిస్తాడు. ప్రపంచస్థాయిలో స్టార్ అయినా, ఆయన ఎంతో వినయంగా ఉంటారు. ఆయనను కలిసినప్పుడు ఆయన కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అనిపిస్తుంది. షారుఖ్ భాయ్ కోసం నేను ఏదైనా సాధించాలి అనే ఆలోచన కలుగుతుంది” అని అయ్యర్ వెల్లడించాడు.