Film industry: ఈ చిత్ర పరిశ్రమకు మరీ ఇన్ని కోట్ల నష్టం రావడం ఏంటి?

జనవరిలోనూ 28 చిత్రాలు విడుదలకాగా, ఆ సినిమాలన్నింటికీ కలిపి భారీగా నష్టం వచ్చింది.

Film industry: ఈ చిత్ర పరిశ్రమకు మరీ ఇన్ని కోట్ల నష్టం రావడం ఏంటి?

Updated On : March 20, 2025 / 9:35 PM IST

కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (KFPA) గత కొన్ని రోజులుగా మలయాళ చిత్ర పరిశ్రమను ఆర్థిక నష్టాల గురించి అప్రమత్తం చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఆ చిత్ర పరిశ్రమ గత నెలలో భారీగా నష్టాలను మూటగట్టుకుంది.

ఫిబ్రవరిలో విడుదలైన 17 మలయాళ చిత్రాలలో కేవలం ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ మాత్రమే హిట్ అయింది. ఇక భారీ ఫ్లాప్ అయిన ‘లవ్ డెల్’ కేవలం రూ.10,000 మాత్రమే వసూలు చేసింది.

Also Read: రానాపై కేసు.. ఫుల్‌ క్లారిటీ ఇచ్చిన ఆయన టీమ్‌

KFPA అందించిన లెక్కల ప్రకారం, ఫిబ్రవరిలో విడుదలైన సినిమాల మొత్తం బడ్జెట్ దాదాపు రూ.75.23 కోట్లు. థియేటర్ షేర్ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం కేవలం రూ.23.55 కోట్లు మాత్రమే. జనవరిలోనూ 28 చిత్రాలు విడుదలకాగా, ఆ సినిమాలన్నింటికీ కలిపి మొత్తం రూ.110 కోట్ల నష్టం వచ్చింది.

KFPA వైస్ ప్రెసిడెంట్ జి.సురేశ్ కుమార్ దీని గురించి మాట్లాడుతూ.. గతంలో పలువురు మలయాళ చిత్రనిర్మాతలు రూ.50 కోట్ల, రూ.100 కోట్ల క్లబ్బుల్లో తమ సినిమా చేరిదంటూ ఎక్కువగా ప్రచారం చేసుకునేవారని, కానీ ప్రస్తుతం అసోసియేషన్ బడ్జెట్, థియేటర్ వసూళ్ల వివరాలను బయటపెట్టిన తర్వాత ఆ ప్రచారాలు నిలిచిపోయాయని తెలిపారు.

అలాగే, ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ ఫేక్ కలెక్షన్లను ప్రోత్సహించి పారితోషికాలు పెంచుకున్నారని చెప్పారు. 2024వ సంవత్సరంలో మలయాళ చిత్ర పరిశ్రమ రూ.700 కోట్లు నష్టాన్ని చవిచూసిందని ఆయన వెల్లడించారు.