బయటికి రావాలంటేనే భయమేసింది: కేఎల్ రాహుల్

‘నా మీద నాకే అనుమానమొచ్చిందని’ అంటున్నాడు టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్. కాఫీ విత్ కరణ్ షో అనే టీవీ కార్యక్రమంలో హార్దిక్ పాండ్యాతో కలిసి రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీంతో బీసీసీఐ వారిద్దరిపై రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల తర్వాత కేఎల్ రాహుల్ బయటికి రావడానికే భయపడ్డాడట. ఆ విషయాన్ని రాహుల్ ఇలా చెప్పుకొచ్చాడు. 

‘నన్ను అభిమానించే వాళ్లంతా తిట్టిపోస్తుంటే తట్టుకోలేకపోయా. మొదటి వారం.. పది రోజుల వరకూ నా క్యారెక్టర్ మీద నాకే అనుమానం వచ్చింది. నిజంగానే నేను చెడ్డ మనిషినా అని పరిశీలన చేసుకున్నా. మొత్తానికి ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే భయమేసింది’

‘ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో అర్థం కాలేదు. ప్రాక్టీసుకు వెళ్లేవాడిని ఇంటికి తిరిగొచ్చేవాడిని. నిజమైన స్నేహితులెవరు.. కుటుంబానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలిసొచ్చాయి. దాదాపు రోడ్డు మీద నిలబడినట్లు అయింది నా పరిస్థితి. దాని నుంచి బయటపడటానికి చాలా కాలమే పట్టింది’ అని కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ కేఎల్ రాహుల్ ముగించాడు.