Rohit Sharma : రోహిత్‌శ‌ర్మ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. ఎల్లుండే హిట్‌మ్యాన్‌కు ఆఖ‌రి మ్యాచ్‌!

టీమ్ఇండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) కెరీర్ ముగిసిందా ? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

Lords ODI could be Rohit Sharmas last match for international cricket

  • ముగియ‌నున్న రోహిత్ శ‌ర్మ అంత‌ర్జాతీయ కెరీర్‌
  • ఇంగ్లాండ్‌తో మూడో వ‌న్డేనే ఆఖ‌రిది
  • కొంప‌ముంచిన పేల‌వ ఫామ్‌!

Rohit Sharma : టీమ్ఇండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ కెరీర్ ముగిసిందా ? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న హిట్‌మ్యాన్‌కు ఎల్లుండి (జూలై 19 ఆదివారం) లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డే మ్యాచే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆఖ‌రిద‌ని తెలుస్తోంది. అత‌డిని వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 ప్ర‌ణాళిక‌ల నుంచి సెల‌క్ట‌ర్లు తొల‌గించిన‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్‌, హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌లు రోహిత్ శ‌ర్మకు వెల్ల‌డించార‌ని క్రికెట్ వ‌ర్గాలు అంటున్నాయి. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా యశస్వి జైస్వాల్ వంటి యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించాలని సెల‌క్ట‌ర్లు భావిస్తున్నార‌ట‌. ఫిట్‌నెస్ పై హిట్‌మ్యాన్ వ‌ర్క్ చేయ‌డంతో అత‌న్ని జ‌ట్టులో కొన‌సాగించాల‌ని తొలుత అనుకున్న‌ప్ప‌టికి కూడా పేల‌వ ఫామ్ నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

IND vs ENG : అదే మా కొంప‌ముంచింది.. రెండో వ‌న్డే ఓట‌మి త‌రువాత శుభ్‌మ‌న్ గిల్ కీల‌క వ్యాఖ్య‌లు

అత‌డి భ‌విష్య‌త్తు గురించి నిర్ణ‌యం తీసుకునే బాధ్య‌త‌ను హిట్‌మ్యాన్‌కే సెల‌క్ట‌ర్లు వ‌దిలివేసిన‌ట్లు ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. కాగా.. ఈ నిర్ణ‌యంపై రోహిత్ శ‌ర్మ కొంత అసంతృప్తితో ఉన్నట్లు స‌మాచారం. రోహిత్ తాను ఆడిన గ‌త ఎనిమిది వ‌న్డేల్లో 30.1 స‌గ‌టుతో 241 ప‌రుగులు చేశాడు.

‘ఇంగ్లాండ్ పర్యటన తర్వాత తమ ప్రణాళికల్లో రోహిత్ లేడని, ఇకపై యువ ఆటగాళ్లతో ముందుకు వెళ్లాలని సెలెక్టర్లు అతనికి చెప్పారు. ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై ఎంతో కష్టపడి పనిచేసిన తర్వాత కూడా రోహిత్ కొనసాగాలని కోరుకున్నాడు. ఇప్పుడు తుది నిర్ణయం పూర్తిగా రోహిత్ చేతుల్లోనే ఉంది.’ అని బీసీసీఐకి చెందిన ఒక అధికారి చెప్పాడు.

‘మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు శ‌త‌కాలు బాదిన య‌శ‌స్వి జైస్వాల్‌కు వ‌న్డేల్లో చాలా అవ‌కాశాలు ఇవ్వాల‌ని సెల‌క్ట‌ర్లు భావిస్తున్నారు. ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు భార‌త జ‌ట్టు దాదాపు 20 వ‌న్డేలు ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌ల్లో య‌శ‌స్వి జైస్వాల్ ను ఆడించాల్సిన అవ‌స‌రం ఉంది.’ అని స‌ద‌రు బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే.. రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టికే టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసింది. గ‌త ఏడాది అత‌డిని వ‌న్డే కెప్టెన్సీ నుంచి త‌ప్పించి ఆ బాధ్య‌త‌ను శుభ్‌మ‌న్ గిల్‌కు అప్ప‌గించారు. ఇప్పుడు అత‌డి వ‌న్డే కెరీర్ సైతం ముగియ‌నుంది.

రోహిత్ శ‌ర్మ త‌న కెరీర్‌లో 287 వ‌న్డేలు ఆడాడు. 279 ఇన్నింగ్స్‌ల్లో 48.6 స‌గ‌టుతో 11757 ప‌రుగులు చేశాడు. ఇందులో 33 సెంచ‌రీలు, 62 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. వ‌న్డేల్లో మూడు సార్లు డ‌బుల్ సెంచ‌రీలు చేసిన ఏకైక ఆట‌గాడిగా రోహిత్ శ‌ర్మ నిలిచాడు. అంతేకాదండోయ్.. వ‌న్డేల్లో అత్య‌ధిక స్కోరు (264 ) రికార్డు అత‌డి పేరిటే ఉంది.