IND vs ENG : అదే మా కొంపముంచింది.. రెండో వన్డే ఓటమి తరువాత శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (IND vs ENG)స్పందించాడు.
Shubman Gill Comments after Team India lost match against england in 2nd ODI
- రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఓటమి
- టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు
IND vs ENG : కార్డిఫ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతానికి 1-1తో సమమైంది. కాగా.. మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్‌లో ఓడిపోయినట్లు టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.
శ్రేయస్ అయ్యర్ (66; 71 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (65; 66 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేయగా మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ లు చెరో మూడు వికెట్లు తీశారు. సాకిబ్ మహమూద్ రెండు వికెట్లు పడగొట్టాడు. సామ్ కరన్, విల్ జాక్స్ లు తలా వికెట్ సాధించారు.
అనంతరం 234 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ (99 నాటౌట్; 133 బంతుల్లో 9 ఫోర్లు) మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి సామ్ కరన్ (26; 31 బంతుల్లో 4 ఫోర్లు), విల్ జాక్స్ (30; 44 బంతుల్లో 2 ఫోర్లు), గస్ అట్కిన్సన్ (23 నాటౌట్; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు చక్కని సహకారం అందించారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ రెండు వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబె, అక్షర్ పటేల్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
నిరాశ కలిగించింది
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. నిజం చెప్పాలంటే ఈ ఫలితం ఎంతో నిరాశను కలిగించిందన్నాడు. 25 ఓవర్లు ముగిసేసరికి తాము మంచి పొజిషన్లో ఉన్నామన్నాడు. ఈజీగా 300 నుంచి 310 పరుగులు చేస్తామని భావించామన్నాడు. అయితే.. పరిస్థితి ఒక్క సారిగా మారిపోయిందన్నాడు. మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయామన్నాడు.
తమ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు (టెయిలెండర్లు) గొప్ప బ్యాటర్లు కాదన్న విషయం తెలుసునని, అయినప్పటికి కూడా ఇంకాస్త బాధ్యత తీసుకోవాల్సి ఉందన్నాడు. ఇంకొన్ని పరుగులు వారి నుంచి ఆశించినట్లు చెప్పుకొచ్చాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా ఈ మ్యాచ్‌లో తమకు లభించిన గొప్ప ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు. తదుపరి మ్యాచ్‌ల్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పి, ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళతామన్నాడు.
Gurnoor Brar : టీమ్ఇండియా పేసర్ గుర్నూర్ బ్రార్‌కు ఐసీసీ షాక్..
తన ఔట్ గురించి మాట్లాడుతూ.. మంచి షాట్ ఆడినప్పుడు బంతి కవర్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్తే ఎవరికైనా బాధగానే ఉంటుందన్నాడు. తనకు కూడా అలాగే అనిపించిందని తెలిపాడు. ఇక వాషింగ్టన్ గాయం గురించి మాట్లాడుతూ.. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మిడ్ ఆఫ్ వైపు సింగిల్ తీసే క్రమంలో గాయపడ్డాడని అన్నాడు. ఈ క్రమంలో ప్రధాన బౌలర్లలోనే బౌలింగ్ చేయించాల్సి వచ్చిందన్నాడు. అతడు గాయపడడం జట్టు వ్యూహాలను దెబ్బతీసిందన్నాడు.
జో రూట్ ఇన్నింగ్స్ గురించి ప్రస్తావిస్తూ.. అతడు చాలా అద్భుతంగా ఆడాడని అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసునని అన్నాడు. ఒకవేళ తాము 300 పరుగులకు పైగా లక్ష్యాన్ని నిర్దేశించి ఉంటే అప్పుడు రూట్ పై ఒత్తిడి పడేదన్నాడు. ఇలాంటి ఓ మోస్తరు లక్ష్యాన్ని చేధించడంలో అతడు దిట్ట అని శుభ్‌మన్ గిల్ అన్నాడు.
