జెర్సీలో బంతి దాచుకుని పరిగెత్తిన బ్యాట్స్‌మన్

బిగ్‌బాష్‌ లీగ్‌ 2020లో భాగంగా మెల్‌బౌర్న్‌ వేదికగా శనివారం స్టార్స్‌, సిడ్నీ థండర్స్‌ మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆసక్తికరమైన ఘటన జరిగింది. మెల్‌బౌర్న్‌ స్టార్స్‌ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో డేనియల్‌ శామ్స్‌ వేసిన బంతిని బ్యాట్స్‌మన్‌ లార్కిన్‌ ఫ్లిక్‌ చేశాడు. పొరబాటున బంతి లార్కిన్‌ జెర్సీలోకి దూరిపోయింది. లార్కిన్‌‌ కొట్టిన బంతి ఎక్కడా కనిపించకపోవడంతో సిడ్నీ థండర్స్‌ ఆటగాళ్లు కన్య్ఫూజ్‌ అయ్యారు.

ఈ విషయం గమనించని లార్కిన్‌ నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌ పిలుపుతో లార్కిన్‌ సింగిల్‌ పూర్తి చేశాడు. ఈ సింగిల్‌ పూర్తి చేసే క్రమంలో జెర్సీ నుంచి బంతి కిందకు జారింది. అది చూసి అవాక్కైన ఫీల్డర్లు ఛీటింగ్.. రనౌట్‌ తప్పించుకోవాలనే ‌అలా చేశాడంటూ ఆరోపించారు.‌ సింగిల్‌ పూర్తి చేసినప్పటికీ అది చెల్లదని అంపైర్‌కు కంప్లైంట్ చేశారు. ఫీల్డ్‌ అంపైర్లు పరిశీలించి లార్కిన్‌ తీసిన సింగిల్‌ను రద్దు చేసి అతన్ని స్ట్రైకింగ్‌కు పంపించారు.

ఈ సంఘటనతో మైదానంలో కాసేపు డ్రామా జరిగింది. ఈ వీడియోను బిగ్‌బాష్‌ లీగ్‌ నిర్వాహకులు ట్విట్టర్‌‌లో షేర్‌ చేశారు.

‘రనౌట్‌ తప్పించుకునేందుకు బంతిని జెర్సీలో దాచి పరుగులు పెట్టాడు. ఎంతైనా లార్కిన్‌ ఇంటలిజెంట్‌ బ్యాట్స్‌మన్‌’ అంటూ సెటైరికల్‌గా రాసుకొచ్చారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కాకపోతే ఆ తర్వాత బంతికే లార్కిన్‌ రనౌట్‌ అయ్యాడు.

మ్యాచ్‌లో మెల్‌బౌర్న్ స్టార్స్‌ 22 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన మెల్‌బౌర్న్‌ స్టార్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగారు. మెల్‌బౌర్న్‌ స్టార్స్‌ జట్టులో స్టోనిస్‌ 61, మ్యాక్స్‌వెల్‌ 39 పరుగులతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఫెర్గ్యూసన్‌ 54 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.