Hardik Pandya : స‌రైన స‌మ‌యంలో గాయ‌పడిన హార్ధిక్‌పాండ్య ..! కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ నెటిజన్లు..

Hardik Pandya-Mohammed Shami : టీమ్ఇండియా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో ఫైన‌ల్ కు దూసుకువెళ్లింది. భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు చేర‌డంలో స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ కీల‌క పాత్ర పోషించాడు.

Hardik Pandya-Mohammed Shami

టీమ్ఇండియా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో ఫైన‌ల్ కు దూసుకువెళ్లింది. భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు చేర‌డంలో స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ కీల‌క పాత్ర పోషించాడు. కివీస్‌తో జ‌రిగిన సెమీ పైన‌ల్ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి న్యూజిలాండ్ ప‌త‌నాన్ని శాసించాడు. ఈ క్ర‌మంలో హార్ధిక్ పాండ్య‌కు నెటిజన్లు ధ‌న్య‌వాదాలు చెబుతున్నారు. అదేంటీ..? ష‌మీ వికెట్లు తీసి గెలిపిస్తే.. పాండ్య‌కు ఎందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు అనేగా మీ డౌట్.. అక్క‌డికే వ‌స్తున్నాం ఆగండి.

ఈ మెగాటోర్నీ ఆరంభంలో టీమ్ఇండియా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ మ‌హ్మ‌ద్ ష‌మీకి చోటు ద‌క్క‌ని సంగ‌తి తెలిసిందే. ఎప్పుడైతే హార్ధిక్ పాండ్య గాయంతో జ‌ట్టుకు దూరం అయ్యాడో ష‌మీకి జ‌ట్టులో చోటు ద‌క్కింది. త‌న‌కు అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ష‌మీ రెండు చేతులా ఒడిసిప‌ట్టుకున్నాడు. ఈ ప్ర‌పంచక‌ప్‌లో తాను ఆడిన మొద‌టి మ్యాచులోనూ న్యూజిలాండ్ పై ఐదు వికెట్లు తీసి స‌త్తా చాటాడు. ఆ త‌రువాత ఇంగ్లాండ్ పై 4, శ్రీలంక పై 5, ద‌క్షిణాఫ్రికా పై 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక సెమీస్‌లో అయితే.. 7 వికెట్లు తీశాడు. మొత్తంగా 6 మ్యాచులు ఆడిన ష‌మీ 23 వికెట్లు ప‌డ‌గొట్టి అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు.

నెట్టింట ఆస‌క్తిక‌ర పోస్టులు..

ఈ క్ర‌మంలో నెట్టింట ఆస‌క్తిక‌ర పోస్టులు పెడుతున్నారు. హార్థిక్ పాండ్య‌కు ధ‌న్య‌వాదాలు చెబుతున్నారు. హార్థిక్ పాండ్య గాయ‌ప‌డ‌కుండా ఉంటే ష‌మీకి జ‌ట్టులో స్థానం ద‌క్కేది కాద‌ని అంటున్నారు. స‌రైన స‌మ‌యంలో పాండ్య గాయ‌ప‌డ్డాడ‌ని అంటున్నారు. హార్థిక్ కు మ్యాన్ ఆఫ్ ది టోర్న‌మెంట్ అవార్డు ఇవ్వాలంటూ కొంద‌రు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

హార్థిక్ గాయ‌ప‌డి ఉండ‌క‌పోతే.. !

ఒక‌వేళ హార్ధిక్ పాండ్య ఫిట్‌గా ఉండి ఉంటే అత‌డు ఖ‌చ్చితంగా తుది జ‌ట్టులో ఆడేవాడు. పేస‌ర్లుగా బుమ్రా, సిరాజ్ లు కొన‌సాగేవారు. మూడో పేస‌ర్‌గా హార్థిక్ ఉండ‌డంతో తుది జ‌ట్టులో షమీకి చోటు ద‌క్క‌డం క‌ష్ట‌మ‌య్యేది. హార్ధిక్ ఆల్‌రౌండ‌ర్ కాబ‌ట్టి అద‌నంగా ఓ బ్యాట‌ర్ లేదా స్పిన్న‌ర్ తీసుకునే వెసులుబాటు ఉండేది. మొద‌టి నాలుగు మ్యాచుల్లో ఇదే జ‌రిగింది.

 

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయిన 398 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ (117), శ్రేయ‌స్ అయ్య‌ర్ (105) సెంచ‌రీలు చేశారు. కివీస్ బౌల‌ర్ల‌లో టిమ్ సౌథీ మూడు, ట్రెంట్ బౌల్డ్‌ ఓ వికెట్ తీశారు.అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డానికి బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవ‌ర్ల‌లో 327 ప‌రుగుల‌కు ఆలౌటైంది. డారిల్ మిచెల్ (134), కేన్ విలిమ‌య్స‌న్ (69) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ ఏడు వికెట్లు తీసి కివీస్ ప‌త‌నాన్ని శాసించాడు. బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌లు ఒక్కొ వికెట్ సాధించారు.