IND vs AFG Today Match : తొలి వన్డేకు ముందు టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయట పెట్టిన బౌలింగ్ కోచ్ మోర్కెల్
భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం (IND vs AFG 1st ODI) కానుంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 13, 2026 / 11:17 AM IST
Morne Morkel on Rohit Sharma Fitness Ahead of Afghanistan ODI
IND vs AFG 1st ODI: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా నేడు (జూన్ 13) తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మపైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొని ఉంది. గత కొన్నాళ్లుగా తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డ రోహిత్ శర్మ కాస్త విరామం తరువాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధం అయ్యాడు. ఈ గాయం కారణంగా ఐపీఎల్ 2026లో కొన్ని మ్యాచ్‌లు ఆడకపోగా.. మరికొన్ని మ్యాచ్‌ల్లో కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గానే ఆడాడు.
ఫిట్‌నెస్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడంతో అఫ్గాన్‌తో సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. అయితే.. తొలి వన్డే మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ ప్రాక్టీస్ సమయంలో తొడ భాగానికి అదనపు రక్షణ ప్యాడ్ ను ధరించి కనిపించాడు. దీంతో అతడి ఫిట్‌నెస్ పై మరోసారి ఆందోళన మొదలైంది. గాయం పూర్తిగా తగ్గలేదా? అనే అనుమానాలు మొదలు అయ్యాయి. వీటిపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పష్టత ఇచ్చాడు.
రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నాడు. అతడు మ్యాచ్ ఆడేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. నెట్స్‌లో వేగంగా వచ్చే బంతుల నుంచి రక్షణ కోసం ప్లేయర్లు అదనపు గార్డు లేదా ప్యాడ్లు ఉపయోగిస్తుండడం చాలా సహజం అని చెప్పుకొచ్చాడు. అతడి లాంటి సీనియర్ ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండడం జట్టుకు ఎంతో బలాన్ని ఇస్తుందన్నాడు.
కోహ్లీ స్థానంలో ఎవరు ఆడతారు?
గాయంతో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఫ్గాన్‌తో తొలి వన్డేలో మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేయనున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. ఇదే ప్రశ్న మోర్కెల్‌కు ఎదురు కాగా.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ప్రయోగాలు చేయనున్నట్లు వివరించాడు. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తామన్నాడు. రాబోయే మ్యాచ్‌ల ద్వారా ఆటగాళ్ల సామర్థ్యాన్ని అంచనా వేసి వన్డే ప్రపంచకప్ 2027కు జట్టును సిద్ధం చేయడమే ప్రస్తుతం తమ ఏకైక లక్ష్యం అని తెలిపాడు.
