Bangladesh vs Australia : ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్.. 23ఏళ్ల తరువాత సంచలన విజయం..
Bangladesh vs Australia : 2003లో డార్విన్లోనే ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ తొలి టెస్టు ఆడింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే డార్విన్‌లో బంగ్లాదేశ్ చరిత్ర తిరగరాసింది.
Bangladesh Beat Australia By 9wickets Historic Test Win
Bangladesh beat Australia by 9 wickets : బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టును ఓడించింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది.. తద్వారా 23ఏళ్ల తరువాత సంచలన విజయాన్ని నమోదు చేసింది.
నెరవేరిన 23ఏళ్ల కల..
2003లో డార్విన్లోనే ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ తొలి టెస్టు ఆడింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే డార్విన్‌లో బంగ్లాదేశ్ చరిత్ర తిరగరాసింది. 23 ఏళ్ల క్రితం ప్రారంభమైన ప్రయాణానికి.. 2026లో అదే వేదికపై చారిత్రక విజయంతో సమాధానం ఇచ్చింది. ఈ విజయం బంగ్లాదేశ్ టెస్టు చరిత్రలోనే అత్యంత ప్రత్యేకమైన విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఆస్ట్రేలియాపై వారి టెస్టు విజయాల సంఖ్య రెండుకు చేరింది. అంతకుముందు 2017లో స్వదేశంలో ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్ ఓడించింది.
టెస్ట్ మ్యాచ్ సాగిందిలా..
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆ జట్టు బ్యాటర్లకు అద్భుత బంతులతో బంగ్లాదేశ్ బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 198 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్ హసన్ మహ్మద్ ఆరు వికెట్లు పడగొట్టాడు. అతని దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టు 426 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తంజిద్ హసన్ శతకంతో మెరిశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ జట్టుకు 228 పరుగుల ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో కామెరాన్ గ్రీన్ ఒంటరి పోరాటం చేశాడు. అతను 104 పరుగులతో శతకం సాధించాడు. అయితే మరో ఎండ్‌లో సహచరుల నుంచి తగిన సహకారం లభించలేదు. ఫలితంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్ ముందు విజయానికి కేవలం 57 పరుగుల లక్ష్యం మాత్రమే నిలిచింది. చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆస్ట్రేలియా బౌలర్లు పెద్దగా సవాలు విసరలేకపోయారు.
బంగ్లాదేశ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 57 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మోమినుల్ హక్ విజయ బౌండరీ సాధించడంతో బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
