మరో సారి రుజువైన ధోనీ బ్రహ్మాస్త్రం

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్టంపౌట్‌ చేయడానికి పెట్టింది పేరు. వికెట్‌కీపర్‌గా ధోనీ నిల్చొంటే బ్యాట్స్‌మన్ గడగడలాడాల్సిందే. ఈ మెరుపు వేగం మరోసారి పనిచేసింది. కివీస్ వికెట్‌ను పడగొట్టి నిబ్బరంగా రివ్యూ కోరిన ధోనీకి థర్డ్ అంపైర్ సైతం మద్దతు పలికాడు. దీంతో ఆ బ్యాట్స్‌మన్ నోరెళ్లబెట్టడం వంతైంది.

 

న్యూజిలాండ్‌తో మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా శనివారం జరుగుతోన్న రెండో వన్డేలో భారత వికెట్ కీపర్ ధోనీ మెరుపు స్టంపింగ్స్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో కేదర్ జాదవ్ బౌలింగ్‌ వేస్తున్నాడు.  స్ట్రైకింగ్‌లో ఉన్న న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్‌టేలర్ బంతిని డిఫెన్స్ చేసేందుకు కాలు కదిపి కొద్దిగా ముందుకు వెళ్లాడు. కానీ, అప్పటికే బ్యాట్‌కి అందని బంతి నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లిపోయింది.

 

వెంటనే అప్రమత్తమైన టేలర్ క్షణాల్లో కాలు వెనక్కి తీసుకోగా అప్పటికే ధోనీ పని పూర్తి చేసేశాడు. క్షణాల వ్యవధిలోనే బంతిని అందుకున్న ధోనీ వికెట్లను గిరాటేశాడు. ఔట్ అని భావించిన ధోనీ అప్పీల్ చేశాడు. బ్యాట్స్‌మెన్ క్రీజు వదిలి ఎక్కువ దూరం వెళ్లకపోవడం‌తో ఫీల్డ్ అంపైర్‌ అయిష్టంగానే నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌ను కోరాడు.

 

వీడియో క్లిప్‌ను పరిశీలించిన థర్డ్ అంపైర్‌ అవుట్‌గా ప్రకటించాడు. బెయిల్స్‌ను పడగొట్టిన సమయంలో టేలర్ పాదం గాల్లోకి ఉన్నట్లు తేలింది. తొలుత ధోనీ అప్పీల్‌ను తిరస్కరించి ఆ తర్వాత థర్డ్ అంపైర్‌కు పంపడంతో ఆఖరి వరకూ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ కాన్ఫిడెంట్‌గానే కనిపించాడు.