రంజీట్రోఫీ విజేత ముంబై.. 42వ సారి టైటిల్ కైవసం

ముంబై టీమ్ 42వ సారి రంజీట్రోఫీ విజేతగా నిలిచి తమ సత్తా ఏంటో మరోసారి చూపించింది.

Ranji Trophy: రంజీట్రోఫీలో ముంబై హవా కొనసాగుతోంది. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్‌లో తనకు తిరుగులేని ముంబై జట్టు మరోసారి రుజువు చేసింది. 2023 24 రంజీ ట్రోఫీని అజింక్య రహానే నాయకత్వంలోని ముంబై టీమ్ కైవసం చేసుకుంది. 42వ సారి రంజీట్రోఫీ విజేతగా నిలిచి తమ సత్తా ఏంటో మరోసారి చూపించింది. వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విదర్భ జట్టును 169 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. 538 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది.

విదర్భ టీమ్ కెప్టెన్ అక్షయ్ వాద్‌క‌ర్ (102) సెంచరీతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. కరుణ నాయర్(74), హర్ష్ దూబే(65) అర్ధ సెంచరీలు చేశారు. అథర్వ తైదే 32, అమన్ మొఖడే 32, ధ్రువ్ షోరే 28 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో తనుశ్ కొటియన్ 4 వికెట్లు పడగొట్టాడు. ముషీర్ ఖాన్, తుషార్ దేశ్ పాండే రెండేసి వికెట్లు తీశారు.

విదర్భ కొంప ముంచిన ఫస్ట్ ఇన్నింగ్స్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేసింది. విదర్భ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 105 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటర్లు అందరూ సమిష్టిగా విఫలమవడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ముంబై 418 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ముషీర్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటిన ముషీర్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 136 పరుగులు చేశాడు. టోర్నమెంట్‌లో తన బౌలింగ్‌తో అదరగొట్టిన తనుశ్ కొటియన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

Also Read: పేరు మార్పుపై హింట్ ఇచ్చిన ఆర్‌సీబీ! అలాఐనా క‌లిసివ‌స్తుందా?

సచిన్ టెండూల్కర్ అభినందనలు
42వ సారి రంజీట్రోఫీ గెలిచిన ముంబై జట్టును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించాడు. ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగిందని పేర్కొన్నాడు. విదర్భ టీమ్ పోరాటం ఆకట్టుకుందని.. అక్షయ్ వాద్‌క‌ర్, కరుణ్ నాయర్, హర్ష్ దూబే బాగా బ్యాటింగ్ చేశారని కితాబిచ్చారు. ముంబై బౌలర్లు చాలా కష్టపడ్డారని.. తనుశ్ 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని ప్రశంసించాడు.

 

ట్రెండింగ్ వార్తలు