Mitchell Santner
IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ శనివారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు.. బ్యాటుతో పరుగుల వరద పారించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయొ 271 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 43 బంతుల్లోనే 103 పరుగులతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ సూర్యకుమార్ 30 బంతుల్లో 63 పరుగులు చేశాడు. చివరిలో హార్ధిక్ పాండ్య 17బంతుల్లో 43 పరుగులు రాబట్టాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫమయ్యారు. దీంతో 19.4 ఓవర్లలో 225 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. దీంతో ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది.
మ్యాచ్ ఓటమి తరువాత న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. టీమిండియా బ్యాటర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఈ సిరీస్ మాకు ఎంతో సహాయపడుతుంది. నేను మొదటి నుంచి చెబుతున్నాను.. భారత్ చాలా బలమైన జట్టు. ముఖ్యంగా సొంతగడ్డపై ఆ జట్టును ఓడించడం చాలా కష్టమని అన్నారు. భారత్ జట్టు భారీ స్కోర్ పై స్పందిస్తూ.. బౌలర్ల కోసం బౌండరీ లైన్లను కాస్త వెనక్కి జరిపితే బాగుంటుందేమో అంటూ సాంట్నర్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
భారత్ జట్టుతో టీ20 సిరీస్ ను మేము కోల్పోయినప్పటికీ.. ఈ సిరీస్ నుంచి చాలా నేర్చుకున్నాం. ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు. కానీ, ప్రతి మ్యాచ్ నుంచి నేర్చుకోవడానికి ఎదో ఒకటి ఉంది. ప్రపంచ కప్ ముగింట ఏం నేర్చుకున్నామంటే చెప్పడం చాలా కష్టం. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడే అద్భుతమైన బ్యాటర్లను ఎదుర్కోవడానికి బౌలింగ్ యూనిట్ గా మేము కొత్త మార్గాలను వెతకాలి. ముఖ్యంగా ఇలాంటి ప్లాట్ పిచ్ లపై 230 పరుగుల ఛేజ్ చేయగలమని తెలిసినప్పటికీ.. భారీ ఓవర్లను 15, 16 పరుగులకే పరిమితం చేయడం నేర్చుకోవాలని మిచెల్ సాంట్నర్ చెప్పుకోచ్చాడు.