ODI World Cup 2027 : గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్‌కు శ్రీకారం.. ఐసీసీ ప్లాన్ ఇదే..
ODI World Cup 2027 : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 మెగా టోర్నీ గాంధీ జయంతి రోజున ప్రారంభించాలని ఐసీసీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
- Harish Thanniru
- Updated on- August 16, 2026 / 03:01 PM IST
Odi World Cup 2027 Could Begin On Gandhi Jayanti As Icc Eyes Special Tribute
ODI World Cup 2027 : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 మెగా టోర్నీ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. అయితే, ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వన్డే ప్రపంచకప్‌ను మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న ప్రారంభించే అంశాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పరిశీలిస్తున్నట్లు సమాచారం. గాంధీజీకి ప్రత్యేక నివాళిగా ప్రపంచకప్ ప్రారంభ తేదీని అక్టోబర్ 2తో ముడిపెట్టాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలిసింది.
Also Read : Bangladesh vs Australia : ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్.. 23ఏళ్ల తరువాత సంచలన విజయం..
మహాత్మా గాంధీ జన్మదినాన్ని ప్రతి ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతిగా జరుపుకుంటాం. శాంతి, అహింస సిద్ధాంతాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన గాంధీజీ జీవితాన్ని స్మరించుకునేలా 2027 వన్డే ప్రపంచకప్‌ను అదే రోజున ప్రారంభించాలని ఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. గాంధీజీ జీవితంలో దక్షిణాఫ్రికాకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన జీవితంలో 21 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో గడిపారు. వచ్చే ప్రపంచకప్ కు అతిథ్యం వహిస్తున్న దేశాల్లో దక్షిణాఫ్రికా కూడా ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న టోర్నీని దక్షిణాఫ్రికా వేదికగా ప్రారంభించాలని ఐసీసీ ప్లాన్ చేస్తుందట.
ఈ మెగా టోర్నీ కోసం దక్షిణాఫ్రికాలో 8, జింబాబ్వేలో 3, నమీబియా రాజధాని విండ్‌హోక్‌లో 1 మొత్తం 12 వేదికలను ఐసీసీ ఇటీవల జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆతిథ్యం దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లతోపాటు భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు స్థానాలకోసం నమీబియా, వెస్టిండీస్, ఐర్లాండ్‌లతో సహా 10జట్ల మధ్య క్వాలిఫైయర్ టోర్నీ జరగనుంది.
ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. శాంతికి చిహ్నమైన గాంధీ జయంతి రోజున వరల్డ్ కప్ ప్రారంభించడం క్రీడా లోకంలో సరికొత్త సందేశాన్ని ఇస్తుందని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2027 అక్టోబర్ 2న ప్రపంచకప్ ప్రారంభం అవుతుందా? లేదంటే వేరే తేదీల్లో ప్రారంభిస్తారా? అనేది ఐసీసీ అధికారిక షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే స్పష్టతరానుంది.
