Salman Ali Agha comments After Pakistan T20 World Cup 2026 Exit
T20 World Cup 2026 : శనివారం పల్లెకల్లె వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గెలిచినప్పటికి కూడా పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచకప్ 2026 నుంచి నిష్ర్కమించింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు చెరో మూడు పాయింట్లతో నిలిచినప్పటికి కూడా మెరుగైన నెట్‌రన్‌రేటు కలిగిన కివీస్ (+1.390) ముందంజ వేసింది. సెమీస్‌కు చేరాలంటే శ్రీలంకను 147 పరుగుల లోపు కట్టడి చేయడంలో పాక్ విఫలమైంది.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (100; 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో చెలరగగా, ఫఖర్ జమాన్ (84; 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టారు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు వికెట్లు తీశాడు. దాసున్ శనక రెండు వికెట్లు పడగొట్టాడు. చమీర ఓ వికెట్ సాధించాడు.
IND vs WI : వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్.. భారత అసిస్టెంట్ కోచ్ కీలక వ్యాఖ్యలు..
అనంతరం 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులకే పరిమితమైంది. దీంతో 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ దాసున్ శనక (76 నాటౌట్; 31 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లు), పవన్ రాత్నాయక్ (58; 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు.
మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడాడు. టీ20 ప్రపంచకప్ 2026 నుంచి నిష్క్రమించడం పై ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఉండే పరిస్థితి ఇంకో రకంగా ఉండేదన్నాడు. ఉస్మాన్ తారిక్‌కు ఇది ఒక చెడ్డ రోజు అని, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదన్నాడు. కొన్నాళ్లుగా మిడిల్ ఆర్డర్ సమస్య ఉందని అంగీకరించాడు.
‘ఈ టోర్నమెంట్ మొత్తం మేము బ్యాటింగ్ బాగా చేయలేదు. పర్హాన్‌కు మరింత మద్దతు ఉంటే బాగుండేది. గత కొన్నాళ్లుగా మిడిల్ ఆర్డర్ సమస్య వేదిస్తోంది. దానిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.’ అని సల్మాన్ అన్నాడు.
‘లంకతో మ్యాచ్‌లో 18 ఓవర్ల పాటు బ్యాటింగ్ చాలా బాగా చేశాం. అయితే చివరి రెండు ఓవర్లు లంక బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఈ పిచ్ పై 160 పరుగులు కూడా డిఫెండ్ చేయడం కష్టమయ్యేది. మంచు ప్రభావం చూపే మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోవడం ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నది. మేము టాస్ గెలిస్తే కథ వేరేలా ఉండేది. మంచు ఓ కారణం. మేము అనుకున్న ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం.’ అని సల్మాన్ అలీ అఘా అన్నాడు.
నువ్వు పాకిస్తాన్ డమ్మీ కెప్టెన్ అని అనుకుంటున్నావా? నువ్వే పాకిస్తాన్ కెప్టెన్సీని వదులుకుంటావా లేదా పీసీబీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నావా ? అనే ప్రశ్న సల్మాన్‌కు ఎదురైంది.
‘నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే అది అగౌరవం అవుతుంది. నేను ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకుంటే అది భావోద్వేగ నిర్ణయం అవుతుంది. కాబట్టి.. నేను ఇంటికి వెళ్లి కెప్టెన్సీ వదులుకోవాలా? వద్దా? అనే దాని గురించి ఆలోచిస్తాను.’ అని సల్మాన్ చెప్పుకొచ్చాడు.