IND vs WI : వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే.. భారత్, వెస్టిండీస్‌లలో ఎవరికి లాభం? ఏ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టనుందంటే?
ఆదివారం మార్చి1న భారత్, వెస్టిండీస్ (IND vs WI ) జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
T20 World Cup 2026 What will happen if Ind vs WI match gets washed out due to rain
- ఆదివారం భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్
- గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌లోకి
- వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరొక పాయింట్
IND vs WI : టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గురువారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే జట్టుపై భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. ఈ ఓటమితో జింబాబ్వే జట్టు సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించింది. మరోవైపు వెస్టిండీస్ పై విజయంతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉండగానే దక్షిణాఫ్రికా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.
గ్రూప్-1లో భారత్‌తో పాటు వెస్టిండీస్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా జట్టు సెమీస్ బెర్తును ఖాయం చేసుకోగా జింబాబ్వే రేసు నుంచి నిష్క్రమించింది. ఇక మిగిలిన ఉన్న ఒక్క స్థానం కోసం వెస్టిండీస్, భారత్ జట్లు పోటీపడుతున్నాయి.
ఇరు జట్లు కూడా ఇప్పటి వరకు సూపర్-8లో చెరో రెండు మ్యాచ్‌లు ఆడాయి. ఒక్కొ విజయాన్ని నమోదు చేసి రెండు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే.. భారత్ (-0.100) కన్నా మెరుగైన నెట్‌రన్‌రేటు కలిగిన వెస్టిండీస్ (+1.791) కలిగి ఉండడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
భారత్ సెమీస్ చేరాలంటే..?
ఆదివారం మార్చి1న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టనుంది.
వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే..?
ఒకవేళ భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం పడి రద్దు అయితే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు ఉన్నాయి. ఇది సూపర్-8 పోరు కావడంతో ఐసీసీ దీనికి ఎలాంటి రిజర్వ్ డేను కేటాయించలేదు. కాబట్టి ఆదివారమే మ్యాచ్ జరగాల్సి ఉంటుంది. వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే.. అప్పుడు ఇరు జట్లకు చెరొక పాయింట్‌ను కేటాయిస్తారు. అప్పుడు కూడా భారత్, వెస్టిండీస్ జట్ల ఖాతాలో చెరో మూడు పాయింట్లు ఉంటాయి. అయితే.. విండీస్‌కు మెరుగైన రన్‌రేటు ఉండడంతో సెమీస్‌కు చేరుకుంటుంది.
దీంతో ఆదివారం వర్షం పడకూడదని, విండీస్ పై భారత్ గెలవాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా.. అక్యూ వెదర్ ప్రకారం ఆదివారం రోజున కోల్‌కతాలో ఎలాంటి వర్ష సూచన లేదు.
