IPL 2021: రాజస్థాన్‌కు లివింగ్‌స్టోన్ స్థానంలో 20ఏళ్ల కుర్రాడు

రాజస్థాన్ రాయల్స్‌లో చేరిన 20 ఏళ్ల జెరాల్డ్ కోట్జీ రచ్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు

ఐపీఎల్ 2021: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ జెరాల్డ్ కోట్జీతో ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ ఒప్పొందం కుదుర్చుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో 4వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో 20ఏళ్ల దక్షిణాఫ్రికా కుర్రాడు జెరాల్డ్ కోట్జీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల లివింగ్‌స్టోన్ ఈ సీజన్ ఐపిఎల్‌ను విడిచిపెట్టేశారు.

ఈ క్రమంలోనే కుడిచేతి వాటం బౌలర్ అయిన జెరాల్డ్ కోట్జీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 23.33 సగటుతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. అండర్ -19 ప్రపంచ కప్ రెండు ఎడిషన్లలో అతను తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో, ఆరు లిస్ట్ ఎ గేమ్స్‌లో వరుసగా 10, 24 వికెట్లు తీసుకున్నాడు.

ఇప్పటికే రాజస్థాన్(ఆర్ఆర్) జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్‌ను కోల్పోగా.. ఇప్పుడు జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్ళు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం క్రిస్ మోరిస్, డేవిడ్ మిల్లెర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ మరియు జోస్ బట్లర్ మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలోనే యువ ఆటగాడిని జట్టులోకి తీసుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఇవాళ(2 మే 2021) సన్ రైజర్స్ హైదరాబాద్‌తో అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడుతోంది.

రాజస్థాన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఏడవ స్థానంలో ఉండగా.. హైదరాబాద్ చేతిలో ఓడిపోతే, ఎనిమిదవ స్థానానికి పడిపోయే పరిస్థితి ఉంది. హైదరాబాద్ ఇప్పటికే 8వ స్థానంలో ఉంది.

ట్రెండింగ్ వార్తలు