Rajat Patidar : అసలు కెప్టెన్‌గానే ఉంటానని అనుకోలేదు.. ఇక కప్పు గురించి అయితే.. రజత్ పాటిదార్ హాట్ కామెంట్స్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడడంపై ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- June 1, 2026 / 11:08 AM IST
Rajat Patidar comments after RCB win IPL 2026 Title (pic credit@ipl)
- వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ట్రోఫీ కైవసం
- ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కామెంట్స్ వైరల్
Rajat Patidar : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా రికార్డులకు ఎక్కింది. ఈ విజయం పై ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ విజయాన్ని ఫ్యాన్స్ కు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు.
ఈ మ్యాచ్ అనంతరం తమ జట్టు ప్రదర్శన పై రజత్ పాటిదార్ స్పందించాడు. వరుసగా రెండోసారి కప్పును సొంతం చేసుకోవడం అద్భుతంగా అనిపిస్తుందన్నాడు. ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ చేరుకున్న తరువాత గత ఏడాది జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. మాకు సంతోషంగా అనిపించింది. ఈ విజయాన్ని గురించి వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. అని రజత్ అన్నాడు.
ఇక టాస్ గెలిచిన తరువాత తొలుత ఫీల్డింగ్ చేయాలనే నిర్ణయం పై మాట్లాడుతూ.. అది మా స్పష్టమైన ప్రణాళిక అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ లక్ష్య ఛేదన సులువుగా ఉంటుంది. అందుకనే ఆ నిర్ణయాన్ని తీసుకున్నామన్నాడు. పవర్ ప్లేలో వారి టాప్-3 ని ఔట్ చేయడం ద్వారా మ్యాచ్ ఈజీ అవుతుందన్నాడు. ఈ మ్యాచ్‌లో మాత్రమే కాకుండా టోర్నమెంట్ అంతటా తమ బౌలర్లు అద్భుతంగా రాణించారన్నాడు. భువి, హేజిల్‌వుడ్, రసిక్ మాత్రమే కాదని ప్రతి బౌలర్ కూడా అత్యుత్తమంగా బంతులు వేశారన్నాడు.
ఆర్‌సీగా కెప్టెన్‌గా తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే తాను కెప్టెన్‌గా ఉంటానని, ఆర్‌సీబీకి ట్రోఫీని అందిస్తానని ఎప్పుడూ కలగనలేదన్నాడు. ఇదంతా ముందే రాసిపెట్టి ఉందని తాను అనుకుంటున్నానని తెలిపాడు. ఇందుకు తాను కృతజ్ఞుడని అన్నాడు. కెప్టెన్‌గా తన ప్రయాణం అద్భుతంగా సాగుతోందన్నాడు. వరుసగా రెండో ఏడాది కప్పును ఎత్తుకోవడం తన జీవితంలో మరిచిపోలేని సందర్భం అని చెప్పాడు. ఇక గత ఏడాది తమ పై తీవ్ర ఒత్తిడి ఉండేదన్నాడు. అయితే.. ఈ సారి అంచనాలు ఉన్నప్పటికి కూడా ఒత్తిడి లేకపోవడంతో తాము స్వేచ్ఛగా ఆడామన్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సన్నాహకాల గురించి వివరిస్తూ.. ప్రాక్టీస్ సెషన్స్‌లో చాలా శ్రమించామన్నాము. విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్ నుంచి చాలా ఇన్‌పుట్స్ తీసుకున్నట్లు వెల్లడించాడు. తన బ్యాటింగ్ ను చాలా మెరుగుపరచుకున్నట్లు తెలిపాడు. జట్టుపై విరాట్ కోహ్లీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్నాడు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటూ అందరిని ప్రోత్సహిస్తాడని తెలిపాడు. కొత్త ఆటగాళ్లు కోహ్లీతో తొలుత మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడేవారని, అయితే.. కోహ్లీనే నేరుగా వెళ్లి వారితో మాట్లాడి ధైర్యం చెప్పేవాడని అన్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారి కోసం ఏం చేసినా తక్కువే అని అన్నాడు. ఈ సలాను కప్ నమ్దు (ఈసారి కూడా కప్ మనదే) అని పాటిదార్ అన్నాడు.
