Rashid Khan : భారత్, ఆస్ట్రేలియా దేశాల పౌరసత్వాలను వదులుకున్న రషీద్ ఖాన్!
అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ (Rashid Khan) సంచలన వ్యాఖ్యలు చేశాడు
- Thota Vamshi Kumar
- Updated on- April 20, 2026 / 12:24 PM IST
Rashid Khan has shared that he turned down offers of citizenship from both India and Australia
- భారత, ఆస్ట్రేలియా దేశాల నుంచి రషీద్ ఖాన్‌కు పౌరసత్వ ఆఫర్లు
- సున్నితంగా తిరస్కరించిన అఫ్గాన్ స్పిన్నర్
Rashid Khan : అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు భారత్‌తో పాటు ఆస్ట్రేలియా దేశాల నుంచి పౌరసత్వం ఇస్తామనే ఆఫర్లు వచ్చాయని, అయితే వాటిని తిరస్కరించినట్లుగా తెలిపాడు. తాను ఎన్నటికి కూడా అఫ్గానిస్థాన్ తరుపుననే క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు.
ఈ స్టార్ లెగ్-స్పిన్నర్ తన ‘రషీద్ ఖాన్: ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్‌డమ్’ అనే పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2023 ఐపీఎల్ సీజన్‌లో జరిగిన ఘటనను ఈ పుస్తకంలో వివరించారు. భారత క్రికెట్‌కు చెందిన ఓ ఉన్నత స్థాయి వ్యక్తి తనను కలవాలని అనుకుంటున్నట్లు ఓ అధికారి తనకు చెప్పారని తెలిపాడు.
‘ఆ తరువాత నేను వెళ్లి ఆయనకు నమస్కరించాను. మేము మాట్లాడుకోవడం ప్రారంభించాము, అప్పుడు ఆయన ఇలా అన్నారు: ‘మీ దేశంలో (అఫ్గానిస్థాన్) పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భారతదేశానికి వచ్చి ఉండండి. మేము మీకు భారతీయ పౌరసత్వం ఇస్తాము. ఇక్కడే క్రికెట్ ఆడండి అని అడిగాడు. ఆయన మాటలకు నేను ఆశ్చర్యపోయాను. ఎలా స్పందించాలో అర్థం కాలేదు. చిన్నగా నవ్వి.. చాలా ధన్యవాదాలు. నేను నా దేశం కోసం మాత్రమే ఆడతాను అని స్పష్టంగా చెప్పాను.’ అని రషీద్ ఖాన్ తెలిపాడు.
భారత దేశం నుంచే కాకుండా ఆస్ట్రేలియా నుంచి కూడా తనకు ఇలాంటి ఆఫర్ వచ్చిందన్నాడు. తాను తన దేశం కోసం ఆడకపోతే మరే ఇతర దేశం కోసం ఆడనని చెప్పినట్లు రషీద్ ఖాన్ తెలిపాడు.
ఇదిలా ఉంటే.. 2018లో ఐపీఎల్‌లో రషీద్ ఖాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్నప్పుడు సోషల్ మీడియాలో అతడికి భారత పౌరసత్వం ఇవ్వాలనే డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఇటీవలే రషీద్ ఖాన్ తండ్రి అయ్యాడు. తన కుమారుడికి అజ్లాన్ ఖాన్ అనే పేరు పెట్టినట్లు వెల్లడించాడు.
