IND vs SL : వాషింగ్టన్ సుందర్‌ను బెదిరించిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
- Thota Vamshi Kumar
- Updated on- August 5, 2024 / 01:09 PM IST
Rohit Hilariously Threatens To Beat Sundar In IND vs SL 2nd ODI
IND vs SL 2nd ODI : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైదానంలో ఆటగాళ్లతో ఫన్నీగా ఉంటూనే హెచ్చరికలు జారీ చేస్తుంటాడు. అతడు మైదానంలో మాట్లాడిన మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అయి సోషల్ మీడియాలో ఎన్నో సార్లు వైరల్‌గా మారాయి. తాజాగా శ్రీలంకతో రెండో వన్డేలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శ్రీలంక ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్‌ను స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వేశాడు. కాగా.. ఈ ఓవర్లో తొలి బంతిని వేసే క్రమంలో వాషింగ్టన్ సుందర్ కాస్త తడబడ్డాడు. రన్ అప్ తీసుకోవడంలో రెండు సార్లు ఇబ్బందులు పడ్డాడు. తొలి సారి బంతిని డెలివరీ చేసే క్రమంలో వికెట్ల వద్దకు వచ్చి ఆగిపోయాడు. దీన్ని చూసిన రోహిత్ శర్మ కాస్త నవ్వుకున్నాడు. అయితే.. రెండో సారి కూడా సుందర్ ఇలాగే చేశాడు.
దీంతో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్.. నిన్ను కొట్టేస్తా అన్నట్లుగా సైగ చేస్తూ పరిగెత్తుకుంటూ బ్యాటర్ ను దాటి కాస్త ముందుకు వచ్చాడు. దీన్ని చూసిన సుందర్‌తో పాటు మిగిలిన ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 32 పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో ఓడిపోయింది.
