Ruturaj Gaikwad century : ఐపీఎల్ 17వ సీజన్లో హోం గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి ఓటమి పాలైంది. మంగళవారం చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. రెండు వందల ఫ్లస్ స్కోరును చేసినప్పటికీ దాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకం సాధించినప్పటికీ జట్టు ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో మొదట చెన్నై బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108 నాటౌట్) శతకంతో చెలరేగగా, శివమ్ దూబె (27 బంతుల్లో 66) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం మార్కస్ స్టోయినిస్ (63 బంతుల్లో 124 నాటౌట్) విధ్వంసం సృష్టించగా నికోలస్ పూరన్ (15 బంతుల్లో 34) మెరుపులు మెరిపించడంతో లక్ష్యాన్ని లక్నో 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Also Read : టీ20 క్రికెట్ ఎంతో మారిపోయింది.. మరింత కష్టపడాల్సిందే..
చెత్త రికార్డు..
ఎవ్వరూ కోరుకోని పలు రికార్డులను చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన పేరిట నమోదు చేసుకున్నాడు. సెంచరీ చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయిన సీఎస్కే తొలి కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కాడు. అంతేకాదండోయ్ మరో రికార్డును నమోదు చేశాడు. ఓటమిని చవిచూసిన జట్లలో సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో రెండు సార్లు రుతురాజ్ గైక్వాడ్ శతకాలు బాదాడు. అయితే.. ఈ రెండు మ్యాచుల్లో చెన్నై ఓడిపోయింది.
ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లి తొలి స్థానంలో నిలిచాడు. కోహ్లి సెంచరీలు చేసిన మూడు సందర్బాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమి పాలైంది. హషీమ్ ఆమ్లా (2), సంజూ శాంసన్ (2), రుతురాజ్ గైక్వాడ్ (2) లు సెంచరీలు చేసిన రెండు మ్యాచుల్లో కూడా ఆయా జట్లు ఓడిపోయాయి.
Also Read : చరిత్ర సృష్టించిన మార్కస్ స్టోయినిస్.. 13 ఏళ్ల నాటి రికార్డు బద్దలు..
ఇక దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.