Samson request to Rajasthan Royals ahead of IPL 2026 auction
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టును వీడనున్నాడు. 2026 ఐపీఎల్ వేలానికి తనను వదిలివేయాలని అతడు ఆర్ఆర్ మేనేజ్‌మెంట్‌ను కోరినట్లు సమాచారం. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే శాంసన్ తన నిర్ణయాన్ని ఫ్రాంఛైజీకి తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఇప్పటి వరకు ఫ్రాంఛైజీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఒకవేళ రాజస్థాన్ అతడిని వదిలివేయాలని అనుకుంటే అప్పుడు అతడిని ట్రేడ్ విండో ద్వారా వేరే ఫ్రాంఛైజీకి బదిలి చేయవచ్చు లేదంటే వేలానికి విడిచిపెట్టవచ్చు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫ్రాంఛైజీదే తుది నిర్ణయం కానుంది.
2013లో ఐపీఎల్‌లో శాంసన్ అరంగ్రేటం చేశాడు. 2013 నుంచి 2015 వరకు అంటే మూడు సీజన్ల పాటు రాజస్థాన్ రాయల్స్ తరుపున శాంసన్ ఆడాడు. ఆ తరువాత రెండు సంవత్సరాలు ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 2018లో తిరిగి రాజస్థాన్ గూటికి చేరుకున్నాడు.
Karun Nair : టీమ్ఇండియా స్టార్ ప్లేయర్‌కు గాయం.. కీలక టోర్నీ నుంచి ఔట్?
2021లో అతడిని ఆర్ఆర్ తమ జట్టు కెప్టెన్‌గా ప్రకటించింది. అతడి సారథ్యంలో రాజస్థాన్ 2022లో ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్ 2025 మెగావేలానికి ముందు శాంసన్‌ను ఆర్ఆర్ రూ.18కోట్లకు అట్టి పెట్టుకుంది. అయితే.. గాయం కారణంగా ఈ సీజన్‌లో శాంసన్ 9 మ్యాచ్‌లే ఆడాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ ప్రదర్శన ఘోరంగా ఉంది. 14 మ్యాచల్లో 4 మాత్రమే గెలిచింది. 9వ స్థానంతో ఈ సీజన్‌ను ముగించింది.
వాస్తవానికి ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలోనే హెడ్ కోచ్ రాహుల్‌ద్రావిడ్, టీమ్‌మేనేజ్‌మెంట్‌తో శాంసన్‌కు మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల పాటు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న జోస్ బట్లర్ వంటి ఆటగాడిని సీజన్‌కు ముందు వదిలివేసుకోవడం, గాయం నుంచి తాను కోలుకుని వచ్చినప్పటికి కూడా కొన్ని మ్యాచ్‌ల్లో రియాన్ పరాగ్‌కే నాయకత్వం ఇవ్వడం వంటి విషయాల్లో శాంసన్ కలత చెందాడు. ఈ క్రమంలోనే అతడు జట్టును వీడతాడని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.
Yashasvi Jaiswal : ముంబై టు గోవా.. నో.. నో.. యశస్వి జైస్వాల్ యూటర్న్ వెనుక అసలు కారణం ఇదేనా..
నవంబర్ చివరిలో లేదా డిసెంబర్‌లో ఐపీఎల్ 2026 వేలం జరగనుంది. ఈ క్రమంలో ఫ్రాంఛైజీలు తాము అట్టి పెట్టుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సమర్పించడానికి నవంబర్ వరకు బీసీసీఐ గడువు ఇచ్చింది. ఈ గడువు లోపు శాంసన్ పై రాజస్థాన్ ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది. అతడిని ఒప్పించి తమ జట్టులోనే కొనసాగించేందుకు ప్రయత్నిస్తుందా? లేదంటే విడిచిపెడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.