Sanju Samson
Sanju Samson: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో జరిగిన ఉత్కంఠ పోరులో 3 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రస్తుతం రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న రాజస్థాన్‌కు ఊహించని షాక్ తగిలింది. దీంతో గెలిచామన్న ఆనందం ఎక్కువ సేపు లేకుండా పోయింది. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్(Sanju Samson)కు జరిమానా పడింది.
IPL 2023, CSK Vs RR: చెన్నైను చిత్తు చేసిన రాయల్స్
చెన్నైతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా రూ.12లక్షల ఫైన్ వేశారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ జట్టు తొలి సారి ఇలా చేయడంతో కెప్టెన్‌కు జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. మరోసారి ఇలాగే జరిగితే అప్పుడు సంజుపై ఓ మ్యాచ్ నిషేదం పడే అవకాశం ఉంది. కాగా..ఈ సీజన్‌లో జరిమానా పడ్డ రెండో కెప్టెన్‌గా శాంసన్ నిలిచాడు. అంతకముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా పడింది.
IPL 2023: డుప్లెసిస్‌కు జరిమానా, హెల్మెట్ విసిరికొట్టిన ఆవేశ్‌ఖాన్‌కు మందలింపు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ జాస్ బట్లర్(52; 36 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) అర్థశతకం బాదగా, దేవదత్ పడిక్కల్(38; 26 బంతుల్లో 5ఫోర్లు) షిమ్రాన్ హెట్మెయర్(30 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది. దీంతో రాజస్థాన్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.