Shubman Gill-Simranjeet Singh : ఇది కదా కిక్కిచ్చేది.. చిన్నప్పుడు గల్లీల్లో గిల్ కి బౌలింగ్.. కట్ చేస్తే ఇప్పుడు వేరే దేశం తరఫున గిల్ కి ప్రత్యర్థిగా రంగంలోకి..
శుభ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి యూఏఈ స్పిన్నర్ సిమ్రన్‌జిత్ సింగ్ (Shubman Gill-Simranjeet Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Shubman Gill Set To Face Childhood Friend In India vs UAE Clash
Shubman Gill-Simranjeet Singh : ఆసియాకప్ 2025 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇక భారత జట్టు తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో ఆడనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి యూఏఈ స్పిన్నర్ సిమ్రన్‌జిత్ సింగ్ (Shubman Gill-Simranjeet Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ చిన్నప్పుడు అతడికి నెట్స్‌లో బౌలింగ్ చేశానని, ఇప్పుడు తాను అతడికి గుర్తు ఉన్నానయో లేదో తెలియదన్నాడు.
35 ఏళ్ల సిమ్రన్‌జిత్ సింగ్ స్వస్థలం పంజాబ్‌లోని లూథియానా. అయితే.. అతడు ఊహించని పరిస్థితుల్లో యూఏఈకి వెళ్లాడు. అక్కడే స్థిరపడిపోయాడు. ‘నాకు గిల్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. అయితే.. ప్రస్తుతం నేను అతడికి గుర్తు ఉన్నానో లేదో తెలియదు. 2011-12లో మొహాలీలో పంజాబ్ క్రికెట్ అకాడమీలో నేను ఉదయం ఆరు నుంచి 11 వరకు ప్రాక్టీస్ చేసేవాడిని.’ అని చెప్పాడు.
గిల్ వాళ్ల నాన్నతో కలిసి ఉదయం 11 గంటల సమయంలో అక్కడి వచ్చేవాడన్నాడు. తాను ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేసే వాడినని, దీంతో గిల్‌కు బౌలింగ్ చేసే వాడినన్నాడు. అయితే.. ఇప్పుడు అతడు తనను గుర్తుపడతాడో తెలియదన్నాడు.
జీవితాన్ని మార్చిన కోవిడ్..
పంజాబ్ జిల్లాస్థాయిలో తాను ఎంతో క్రికెట్ ఆడినట్లు సిమ్రన్‌జిత్ సింగ్ చెప్పాడు. గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొహాలీలో సెషన్‌లు నిర్వహించినప్పుడు తాను నెట్స్‌లో ఆ టీమ్ కు బౌలింగ్ చేసినట్లుగా గుర్తు చేసుకున్నాడు. కొవిడ్ తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో వివరించాడు.
2021 ఏప్రిల్‌లో తనకు 20 రోజుల పాటు దుబాయ్‌లో ప్రాక్టీస్ చేసేందుకు ఆఫర్ వచ్చిందని చెప్పాడు. దీంతో తాను దుబాయ్ వెళ్లానని చెప్పాడు. ఆ సమయంలో భారత్‌లో కొవిడ్ వేవ్ తీవ్ర స్థాయికి చేరిందని మరోసారి లాక్ డౌన్‌ను విధించారన్నారు. దీంతో తాను ఇండియాకు రాలేకపోయానన్నాడు. నెలల తరబడి యూఏఈలోనే ఉండిపోవాల్సి వచ్చిందన్నాడు. ఆ తరువాత అక్కడే ఉండిపోయానన్నాడు.
జూనియర్ ఆటగాళ్లకు కోచింగ్ ఇవ్వడం ద్వారా కుటుంబాన్ని నెట్టుకువచ్చానని, ఆ తరువాత ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం కుదిరిందన్నాడు.