IPL 2026 Schedule : ఐపీఎల్ షెడ్యూల్ పై కీలక అప్డేట్.. ఆ రోజే షెడ్యూల్ విడుదల..
ఐపీఎల్ 2026 షెడ్యూల్ పై (IPL 2026 Schedule) బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక అప్డేట్ ఇచ్చారు.
BCCI Secretary Devajit Saikia Gives Big Update On IPL 2026 Schedule
- మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్
- ఇంకా విడుదల కానీ షెడ్యూల్
- కీలక అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ కార్యదర్శి
IPL 2026 Schedule : ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. మే 31 వరకు కొనసాగనుంది. అయితే.. ఈ మెగాటోర్నీ ఆరంభానికి మరో 18 రోజుల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికి కూడా బీసీసీఐ ఇప్పటి వరకు ఐపీఎల్ 2026 షెడ్యూల్‌ను విడుదల చేయలేదు.
తాజాగా షెడ్యూల్ పై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక అప్డేట్ ఇచ్చారు. తొలి 20 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌ను మార్చి 12 వరకు విడుదల చేస్తామని అన్నారు.
‘మార్చి 12 నాటికి ఐపీఎల్ 2026 షెడ్యూల్‌ను ప్రకటించాలని మేము ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతానికి తొలి 20 రోజులకు ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించబోతున్నాము.’ అని సైకియా మంగళవారం మీడియాకు తెలిపారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడులలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో వాటి షెడ్యూల్ కోసం బీసీసీఐ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లు క్లాష్ కాకుండా ఉండేందుకు తొలి 20 రోజుల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల రోజుల్లోనే ఐపీఎల్ మ్యాచ్‌లు ఉంటే ఆయా మైదానాల్లో భద్రత కల్పించడం కష్టం అవుతుంది. అందుకనే బీసీసీఐ ఎన్నికల షెడ్యూల్ కోసం వేచి చూస్తున్నట్లుగా అర్థమవుతోంది.
షెడ్యూల్ విడుదల కాకున్నా..
ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కానప్పటికి కూడా ఇప్పటికే దాదాపుగా అన్ని జట్లు కూడా తమ సన్నాహకాలను మొదలుపెట్టాయి. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 1 నుంచి ప్రాక్టీస్ ను ప్రారంభించింది. నవలూర్‌లోని తమ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్లో శిక్షణను ప్రారంభించింది, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోనిలతో దాదాపుగా ఆటగాళ్లు అందరూ అక్కడ శిక్షణ పొందుతున్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫిబ్రవరి 10న నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఒక చిన్న సన్నాహక శిబిరాన్ని నిర్వహించగా, 2022 ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ నాథ్ద్వారాలోని మిరాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండుసార్లు ప్రాక్టీస్ సెషన్లను నిర్వహించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్చి 1 నుంచి తమ దేశీయ ఆటగాళ్లతో తమ క్యాంప్‌ను ప్రారంభించింది. ఐదుసార్లు విజేతలుగా నిలిచిన ముంబై ఇండియన్స్ కూడా రాబోయే సీజన్ కోసం తమ శిక్షణను ప్రారంభించింది.
