Shreyas Iyer : మా విజ‌యానికి అదే కార‌ణం.. టీమ్ఇండియా తాత్కాలిక వ‌న్డే కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కామెంట్స్‌..

Shreyas Iyer : మౌంట్ మౌంగనుయి వేదిక‌గా జ‌రిగిన 5వ వ‌న్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై భార‌త్ 22 తేడాతో విజ‌యం సాధించింది.

Shreyas Iyer Comments after Team India beat New Zealand in 5th ODI

Shreyas Iyer : మౌంట్ మౌంగనుయి వేదిక‌గా జ‌రిగిన 5వ వ‌న్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై భార‌త్ 22 తేడాతో విజ‌యం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను టీమ్ఇండియా 3-1 తేడాతో కైవ‌సం చేసుకుంది. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఐదో మ్యాచ్‌లో, సిరీస్ సాధించ‌డం ప‌ట్ల టీమ్ఇండియా తాత్కాలిక వ‌న్డే కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ 42.1 ఓవ‌ర్ల‌లో 209 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త‌ బ్యాట‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ (46; 55 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఇషాన్ కిష‌న్ (46; 58 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)లు రాణించారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ (22), న‌మ‌న్ ధీర్ (22) లు ప‌ర్వాలేద‌నిపించారు. కివీస్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్, జాకబ్ డఫీ చెరో మూడు వికెట్లు తీశారు. మాథ్యూ ఫిషర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. బ్లెయిర్ టిక్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్ చెరో ఓ వికెట్ సాధించారు.

అనంత‌రం 210 ప‌రుగుల లక్ష్య ఛేద‌న‌లో న్యూజిలాండ్ 48.1 ఓవ‌ర్ల‌లో 187 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌లో డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (31; 42 బంతుల్లో 5 ఫోర్లు), నిక్ కెల్లీ (24; 45 బంతుల్లో 2 ఫోర్లు), మిచెల్ సాంట్న‌ర్ (24; 31 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స‌ర్లు) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. సిరాజ్, అక్ష‌ర్ ప‌టేల్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అకిబ్ న‌బీ, య‌శ్ ఠాకూర్‌, న‌మ‌ర్ ధీర్‌లు త‌లా ఓ వికెట్ సాధించారు.

ఐదో వ‌న్డేలో విజ‌యం సాధించిన అనంత‌రం టీమ్ఇండియా తాత్కాలిక వ‌న్డే కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు. న్యూజిలాండ్‌లో పర్యటించి టీ20, వన్డే సిరీస్‌లు ఆడినప్పుడు మాకు భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. వాతావరణం కూడా ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని విజయాలు సాధించడం గొప్ప విషయం. ఈ రోజు కూడా బ్యాటింగ్‌లో మేము ఆశించినన్ని పరుగులు చేయలేకపోయినా, ఎప్పుడైనా మ్యాచ్‌ను మా వైపు తిప్పగలమనే నమ్మకం మాలో ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరూ అదే ఆలోచనతో ఉండటం, ఆ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అని శ్రేయ‌స్ అయ్య‌ర్ అన్నాడు.

సాకులు చెప్పాల‌ని అనుకోలేదు..

ఇక సిరీస్‌లో బౌల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న గురించిమాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే.. ఈ సిరీస్ బ్యాటర్లకు అంత అనుకూలంగా లేదు. కానీ మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. పరిస్థితులు ఎలా ఉన్నా జట్టును గెలిపించగలమనే పూర్తి నమ్మకంతో వారు బరిలోకి దిగారు. ఆటగాళ్లందరిలో ఉండాల్సిన దృక్పథం ఇదే, ప్రతి ఒక్కరిలోనూ అద్భుతమైన వ్యక్తిత్వం ఉంది. ఇది నిజంగా అసాధారణం. అని శ్రేయ‌స్ తెలిపాడు.

గాయాలు, టెస్టు సిరీస్ కోసం ప‌లువురు ఆట‌గాళ్లు అందుబాటులో లేకపోవడం గురించి మాట్లాడుతూ.. జట్టులో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతున్నప్పుడు ఆటగాళ్లకు కొన్ని సందర్భాల్లో సవాళ్లు ఎదురవుతాయి. కొత్త పరిస్థితులకు అలవాటు పడటంతో పాటు వాటికి అనుగుణంగా తమ ఆటను మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే.. మేము ఎటువంటి సాకులు చెప్పాలనుకోలేదు. మాపై ఉన్న అంచనాలను అందుకోవాలని, ప్రతి ఆటగాడు తన వంతు ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నాం.

అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి మాకు మద్దతు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఫలితాలు ఎలా ఉన్నా వారు రెండు జట్లనూ ప్రోత్సహించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. కొన్ని సందర్భాల్లో విజయం మావైపు ఉంటే, మరికొన్ని సందర్భాల్లో న్యూజిలాండ్‌కు దక్కింది. అయినప్పటికీ అభిమానులు ఇరు జట్లకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి ఆదరణ మాకు ఎంతో అవసరం. అభిమానుల నుంచి లభించే స్ఫూర్తి మాకు ఎంతో విలువైనది. క్రీడ కూడా మరో స్థాయికి ఎదుగుతోంది. ఇక్కడికి వచ్చి మాపై ప్రేమాభిమానాలు చూపించి, మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అని శ్రేయ‌స్ అయ్య‌ర్ అన్నాడు.