Shreyas Iyer : అఫ్గాన్‌తో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్.. టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్ వైరల్..
అఫ్గాన్‌తో మూడో టీ20 మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మాట్లాడాడు.
- Thota Vamshi Kumar
- Updated on- September 18, 2026 / 08:14 AM IST
Shreyas Iyer key comments after india beat Afghanistan in 3t20match
Shreyas Iyer : అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం ఢిల్లీ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అఫ్గాన్ పై భారత్ 127 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
అభిషేక్ శర్మ (108; 34 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (50; 35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. శ్రేయస్ అయ్యర్ (29; 20 బంతుల్లో 2 సిక్సర్లు) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ రెండు వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్ చెరో వికెట్ సాధించారు.
అనంతరం 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (25), రహ్మానుల్లా గుర్బాజ్ (15), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (17), నూర్ ఉల్ రెహ్మాన్ (11)లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, యశ్ ఠాకూర్‌లు చెరో వికెట్ సాధించారు.
సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం పట్ల టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ఈ సిరీస్‌కు అఫ్గాన్ ఆతిథ్యం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గౌరవం ఉంటుందన్నాడు. ఇక వారు సిరీస్ సాధించలేకపోయినప్పటికి కూడా ఆటతీరు బాగుందన్నాడు.
ఈ పిచ్ పై బ్యాటింగ్ అంత సులభం కాదన్నాడు. కానీ అభిషేక్ శర్మ ఆడిన తీరు నిజంగా అద్భుతం అని చెప్పుకొచ్చాడు. అతడు సెంచరీ చేయడం తనకు ఆనందాన్ని కలిగించిందని చెప్పాడు. ఇక తాము తొలుత బ్యాటింగ్ చేస్తామన్న విషయం తనకు ముందే తెలుసునని అన్నాడు. అద్భుతమైన ఆరంభం లభించిందన్నాడు. ఆ తరువాత కూడా బ్యాటర్లు బాగా రాణించి స్కోరు బోర్డుపై 220 పరుగుల చేర్చడం నిజంగా ప్రశంసనీయం అని తెలిపాడు.
ఇక అక్షర్ పటేల్ బౌలింగ్ ప్రదర్శన పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడికి ఎంతో అనుభవం ఉందన్నాడు. కీలక సమయంలో రాణించడంలో అతడు సిద్ధహస్తుడని తెలిపాడు. చాలా కాలంగా అతను ఇలాగే రాణిస్తున్నాడని తెలిపాడు.
