Shreyas Iyer Leaves India A Captaincy Hours Before Australia A Match
Shreyas Iyer : టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియా-ఏతో రెండో అనధికారిక టెస్టుకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత-ఏ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పాటు జట్టు నుంచి వైదొలిగాడు. చివరి నిమిషాల్లో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తప్పుకోవడంతో రెండో టెస్టు మ్యాచ్‌కు భారత-ఏ జట్టు కెప్టెన్‌గా ధ్రువ్ జురెల్ వ్యవహరించనున్నాడు.
కాగా.. జట్టును వీడిన వెంటనే శ్రేయస్ లక్నో నుంచి ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. అతడు వ్యక్తిగత కారణాలతోనే జట్టు నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం.
తొలి టెస్టులో విఫలం..
ఆస్ట్రేలియా-ఏ జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లోని తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ విఫలం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. స్పిన్నర్ కోరి రోకిసియోలి బౌలింగ్‌లో ఎల్బీడబ్లూగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే.. అంపైర్ నిర్ణయానికి అతడు బలైయ్యాడు. బంతి లెగ్‌స్టంప్ అవతలకు వెలుతున్నట్లుగా కనిపిస్తుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటిన అయ్యర్..
దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అయ్యర్ సత్తా చాటాడు. 5 మ్యాచ్‌ల్లో 48.60 సగటుతో 243 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోర్లలో ఒకడిగా నిలిచాడు.
వన్డేల్లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నప్పటికి అతడు టెస్టు, టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా లేడు. ఈ క్రమంలో అతడు మూడు ఫార్మాట్లలో జట్టులో కీలక ఆటగాడిగా మారేందుకు గట్టి కృషి చేస్తున్నాడు.
విండీస్‌తో టెస్టు సిరీస్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ రేసులో అయ్యర్ ఉన్నాడు. అక్టోబర్ 2 నుంచి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం సెలక్టర్లు జట్టును ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.