Shubman Gill : ఆ త‌ప్పే మా కొంప‌ముంచింది.. రోహిత్ శ‌ర్మ ఉన్నాడు చూడండి.. శుభ్‌మ‌న్ గిల్ హాట్ కామెంట్స్‌..

బౌలింగ్‌లో ఆఖ‌రి మూడు ఓవ‌ర్ల‌లో భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకోవ‌డమే త‌మ కొంప‌ముంచింద‌ని టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తెలిపాడు.

Shubman Gill Comments after Team India lost ODI series against England

Shubman Gill : ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన టీమ్ఇండియా వ‌న్డే సిరీస్‌ను చేజార్చుకుంది. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. ఆదివారం లార్డ్స్‌ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ 27 ప‌రుగుల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. బౌలింగ్‌లో ఆఖ‌రి మూడు ఓవ‌ర్ల‌లో భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకోవ‌డమే త‌మ కొంప‌ముంచింద‌ని టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

బెన్‌డ‌కెట్ (141; 135 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ సెంచ‌రీ చేయ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 387 ప‌రుగులు చేసింది. మిగిలిన వారిలో జాక‌బ్ బెథెల్ (91; 93 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తృటిలొ శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. జోరూట్ (74 నాటౌట్; 48 బంతుల్లో 9 ఫోర్లు)హాఫ్ సెంచ‌రీ చేయ‌గా.. ఆఖ‌రిలో జోస్ బ‌ట్ల‌ర్ (41 నాటౌట్; 13 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్ప‌ర్లు) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ధ్ కృష్ణ రెండు, ప్రిన్స్ యాద‌వ్ ఓ వికెట్ తీశాడు.

ఆ త‌రువాత రోహిత్ శ‌ర్మ (138; 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) భారీ సెంచ‌రీ సాధించగా, శుభ్‌మ‌న్ గిల్ (77; 84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్ కోహ్లీ (74; 60 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించ‌న‌ప్ప‌టికి కూడా 388 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 360 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఇంగ్లీష్ బౌల‌ర్ల‌లో సామ్ క‌ర‌న్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జోఫ్రా ఆర్చ‌ర్‌, ఆదిల్ ర‌షీద్, జాక‌బ్ బెథెల్ త‌లా ఓ వికెట్ సాధించారు.

మాకు వాళ్లు ఆ అవ‌కాశ‌మే ఇవ్వ‌లేదు..

ఇక మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ స్పందించాడు. ఈ మ్యాచ్‌ ఓట‌మి నిరాశ క‌లిగించింద‌న్నాడు. ఈ మ్యాచ్‌లో తాము బౌలింగ్ సరిగ్గా చేయలేదన్నాడు. ప్రత్యేకించి పవర్‌ప్లేలోన‌ని చెప్పాడు. పవర్‌ప్లేలో స‌రైన లైన్ అండ్ లెంగ్త్ లో బంతులు వేయ‌ద‌న్నాడు. దీన్ని స‌ద్వినియోగం చేసుకున్న ప్ర‌త్యర్థి ఓపెన‌ర్లు ప‌వ‌ర్ ప్లే త‌రువాత అద్భుతంగా ఆడార‌ని అన్నాడు. ఆ త‌రువాత వారు త‌మ‌కు మ్యాచ్‌లో తిరిగి వ‌చ్చే అవ‌కాశ‌మే ఇవ్వ‌లేద‌న్నాడు. ఇక డెత్ ఓవర్లలో ఆఖ‌రి మూడు ఓవ‌ర్ల‌లో ఎక్కువ ప‌రుగులు ఇచ్చేశామ‌న్నాడు. దాదాపు 60 ప‌రుగులు స‌మ‌ర్పించుకోవ‌డంతోనే మ్యాచ్ చేజారిపోయింద‌న్నాడు.

Rohit sharma : చారిత్రాత్మ‌క లార్డ్స్‌లో చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ప‌లు రికార్డులు బ్రేక్‌..

నిజం చెప్పాలంటే ల‌క్ష్య ఛేద‌న‌లో త‌మ ప్ర‌ణాళిక‌లు చాలా స్ప‌ష్టంగా ఉన్నాయ‌న్నాడు. 40 ఓవ‌ర్ల వ‌ర‌కు ఎక్కువ వికెట్లు కోల్పోకుండా ఉంటే తాము పోటీలో ఉంటామ‌ని భావించామ‌న్నాడు. అదే స‌మ‌యంలో మ‌రింత వెనుక‌బ‌డిపోకూడ‌ద‌ని భావించామ‌న్నాడు. అందుక‌నే ప‌వ‌ర్ ప్లే త‌రువాత ప‌రుగులు చేయ‌డం పై దృష్టి సారించామ‌న్నాడు. ర‌న్‌రేటును 6 లేదా 6.5 మ‌ధ్య ఉంచుతూ ముందు సాగాల‌ని అనుకున్న‌ట్లు తెలిపాడు. ఆఖ‌రి 10 ఓవ‌ర్ల‌లో 100 నుంచి 110 సాధించ‌వ‌చ్చున‌ని అనుకున్నామ‌ని, అలా చేసి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేద‌న్నాడు. భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో 45వ ఓవ‌ర్ వ‌ర‌కు తాము పోటీలో నిలిచామ‌ని చెప్పుకొచ్చాడు.

ఇక సిరీస్ ఓడిపోయిన‌ప్ప‌టికి కూడా ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయ‌న్నాడు. ఈ సిరీస్‌లో దాదాపు బ్యాట‌ర్లు అందరూ పరుగులు చేశార‌ని అదే స‌మ‌యంలో బౌల‌ర్లు వికెట్లు తీశార‌న్నాడు. ఇక సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ లు గురించి మాట్లాడుతూ.. గ‌త కొన్నేళ్లుగా ప్ర‌పంచ వ్యాప్తంగా వారిద్ద‌రు అద్భుతంగా రాణించార‌న్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ చేసిన తీరు చాలా బాగుంద‌న్నాడు. అత‌డు 140 పరుగులు సాధించడం త‌న‌కు చాలా సంతోషాన్నిచ్చిందన్నాడు. ఆఖ‌రిలో పిచ్ కొంచెం నెమ్మదించిందని, పరుగులు చేయడం అంత సులభం కాదు. కానీ అతను బ్యాటింగ్ చేసిన తీరు చూడటానికి నిజంగా అద్భుతంగా అనిపించింది అని శుభ్‌మ‌న్ గిల్ తెలిపాడు.