Rohit sharma : చారిత్రాత్మక లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. పలు రికార్డులు బ్రేక్..
రిటైర్మెంట్ ఊహాగానాల నడుమ టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit sharma)లార్డ్స్‌లో చరిత్ర సృష్టించాడు
Rohit sharma creates history first indian batter to score an ODI hundred at iconic venue lords
Rohit sharma : రిటైర్మెంట్ ఊహాగానాల నడుమ టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ లార్డ్స్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ చారిత్రాత్మక మైదానంలో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో 84 బంతుల్లో మూడు అంకెల స్కోరు అందుకుని హిట్‌మ్యాన్ ఈ ఘనత అందుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 138 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పలు రికార్డలను సైతం రోహిత్ శర్మ సాధించాడు.
పర్యాటక దేశంలో అత్యధిక సెంచరీలు..
తాజా సెంచరీ ఇంగ్లాండ్ గడ్డ పై వన్డేల్లో రోహిత్ శర్మకు ఎనిమిదో సెంచరీ. ఈ క్రమంలో ఓ పర్యాటక దేశంలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. సచిన్ యూఏఈలో 7 శతకాలు చేశాడు.
పర్యాటక దేశంలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
* రోహిత్ శర్మ (భారత్) – ఇంగ్లాండ్‌లో 8 సెంచరీలు
* సచిన్ టెండూల్కర్ (భారత్) – యూఏఈలో 7 సెంచరీలు
* సయీద్ అన్వర్ (పాకిస్థాన్) – యూఏఈలో 7 సెంచరీలు
* ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) – భారతదేశంలో 7 సెంచరీలు
* క్వింటన్ డికాక్ (దక్షిణాప్రికా) – భారతదేశంలో 7 సెంచరీలు
- అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఓపెనర్ల జాబితాలో రోహిత్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా 45 సెంచరీలు సాధించగా.. భారత మాజీ కెప్టెన్ అయిన రోహిత్ తాజా సెంచరీతో.. 46 శతకాలు సాధించాడు.
- అతి పెద్ద ఏజ్‌లో వన్డేలలో సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ క్రమంలో కూడా అతడు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను అధిగమించడం విశేషం. సచిన్ తన చివరి వన్డే సెంచరీని 38 ఏళ్ల 327 రోజుల వయసులో సాధించగా.. లార్డ్స్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పుడు అతడి వయసు 39 ఏళ్ల 80 రోజులు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్‌డకెట్ (141; 135 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీ చేశాడు. జాకబ్ బెథెల్ (91; 93 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు), జోరూట్ (74 నాటౌట్; 48 బంతుల్లో 9 ఫోర్లు)హాఫ్ సెంచరీలు చేశారు. ఆఖరిలో జోస్ బట్లర్ (41 నాటౌట్; 13 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్పర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీయగా ప్రిన్స్ యాదవ్ ఓ వికెట్ సాధించాడు.
First Indian to score an ODI century at Lord’s ✅
8️⃣th ODI century in England ✅Rohit Sharma with a special knock at the Home of Cricket 💙
Updates ▶️ https://t.co/pLZ2PvDH5G#TeamIndia | #ENGvIND | @ImRo45 pic.twitter.com/S23LZfktRi
— BCCI (@BCCI) July 19, 2026
అనంతరం 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 27 పరుగులతో ఓడిపోయింది. తద్వారా వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో చేజార్చుకుంది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (138; 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీ సాధించగా శుభ్‌మన్ గిల్ (77; 84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లీ (74; 60 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ నాలుగు వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జాకబ్ బెథెల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
