Smriti mandhana comments after RCB beat Delhi in WPL 2026 final
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రెండో సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్పును ముద్దాడింది. వడోదర వేదికగా గురువారం జరిగిన డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. ఇక తాము విజేతగా నిలవడానికి పేసర్ లారెన్ బెల్ అసాధారణ బౌలింగే అని ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది.
మ్యాచ్ అనంతరం మంధాన మాట్లాడుతూ.. రెండో సారి విజేతగా నిలవడంతో ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. ఇక ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఎంతో గొప్ప అభిమానులు అని కొనియాడింది. నాలుగేళ్లలో రెండు టైటిల్స్ గెలవడం చాలా బాగుందని అంది. ఇక ఫ్రాంఛైజీకి గత మూడేళ్లుగా వరుసగా మూడో టైటిల్ (డబ్య్లూపీఎల్ 2024, ఐపీఎల్ 2025, డబ్ల్యూపీఎల్ 2026) రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసింది.
WPL 2026 : ఆర్సీబీ విజయోత్సవ సంబురాలు.. స్మృతి మంధాన ఆనందం చూశారా.. ఫొటోలు వైరల్..
ఇక ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. లారెన్ బెల్, జార్జియా వాల్ పై ప్రశంసలు కురిపించింది. ‘ఇక ఈ పిచ్ పై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలమని భావించాము. ఇది బ్యాటింగ్ పిచ్. చివరి నాలుగు ఓవర్లలో మా బౌలర్లు చాలా బాగా వేశారు. ఖచ్చితంగా లారెన్ బెల్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. 400 పైగా పరుగులు నమోదైన మ్యాచ్‌లో ఆమె నాలుగు ఓవర్లు వేసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇవ్వడం అద్భుతం. నా దృష్టిలో ఆమెది మ్యాచ్ విన్నింగ్ స్పెల్.’ అని స్మృతి అంది.
2024 🔂 2026 ❤️🔥
𝑬𝒆𝒆𝒆 𝑺𝒂𝒍𝒂 𝑪𝒖𝒑 𝑵𝒂𝒎𝒅𝒖, AGAIN! 🥹
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 5, 2026
ఇక జార్జియా వాల్‌తో తన భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. ఆమె చాలా బాగా ఆడిందని చెప్పింది. ముఖ్యంగా పవర్ ప్లేలో ఆమె దాదాపు స్ట్రైక్‌ను తీసుకుని బ్యాటింగ్ చేసింది. 10 లేదా 15 రోజుల క్రితం మా ప్లేయర్లకు నేను ఓ విషయం చెప్పాను. ఫైనల్ మ్యాచ్‌లో వాల్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడుతుందని అన్నాను. నిజంగానే ఈ రోజు ఆమె చేసి చూపించింది. ఇక సహాయక సిబ్బంది కూడా ఎంతో గొప్ప సహకారాన్ని అందించారు. అమ్మాయిలు ఎంతో కష్టపడ్డారు. ఈ విజయం వారి నమ్మకాన్ని ఇంకా పెంచుతుంది. ఈ రోజు ఇంటికి వెళ్లేటప్పుడు మా జట్టులోని ప్రతి ఒక్కరు ఈ విజయంలో నా పాత్ర కూడా ఉంది అని గర్వంగా చెప్పుకుంటారు.
2024లో నేను దీన్ని చెప్పాను. ఇప్పుడు చెబుతున్నా.. ఈ సాలా కప్ నమ్దు 2 అంటూ ఎడమ చేతితో రెండును చూపించింది స్మృతి మంధాన.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (57) లారా వోల్వార్డ్ట్ (44), లిజెల్ లీ (37), చినెల్లే హెన్రీ (35 నాటౌట్) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో సయాలి సత్ఘారే, నాడిన్ డి క్లెర్క్, అరుంధతి రెడ్డిలు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం స్మృతి మంధాన (87; 41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), జార్జియా వాల్ (79; 54 బంతుల్లో 14 ఫోర్లు)లు చెలరేగడంతో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్‌సీబీ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఢిల్లీ బౌలర్లలో చినెల్లే హెన్రీ రెండు వికెట్లు తీసింది. నందిని శర్మ, మిన్నుమణి లు చెరో వికెట్ సాధించారు.