Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ‘ట్రిపుల్ సెంచరీ’
టీమ్ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన మైలురాయిని చేరుకుంది.
- Thota Vamshi Kumar
- Updated on- July 11, 2026 / 07:52 AM IST
Smriti Mandhana creates History Stunning Record In India vs England Lords Test
- స్మృతి మంధాన అరుదైన ఘనత..
- అంతర్జాతీయ క్రికెట్‌లో 300 మ్యాచ్‌లు
Smriti Mandhana : టీమ్ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అరుదైన మైలురాయిని చేరుకుంది. మహిళల క్రికెట్‌లో 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతి పిన్న వయస్కురాలిగా (29 సంవత్సరాలు 357 రోజుల వయసులోనే) నిలిచింది. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన టెస్టు మ్యాచ్ ద్వారా స్మృతి ఈ ఘనత సాధించింది. ఓవరాల్‌గా మహిళల క్రికెట్‌లో 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 12వ ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కింది.
మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు గురించి మంధాన మాట్లాడుతూ.. సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకు ఈ విషయం గత రాత్రినే తెలిసిందని తెలిపింది. అన్ని ఫార్మాట్లలో ఆడుతూ ఉండటంతో మ్యాచ్‌ల సంఖ్యను లెక్కపెట్టే అలవాటు లేదని అంది. 2017 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ను కూడా లార్డ్స్‌లోనే ఆడానని గుర్తుచేసుకుంది. ఆ టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయానని, మళ్లీ భారత జట్టుకు ఆడే అవకాశం వస్తుందో లేదో అప్పట్లో అనిపించిందని వెల్లడించింది. అలాంటి పరిస్థితుల నుంచి పుంజుకుని.. లార్డ్స్ మైదానంలోనే 300వ మ్యాచ్ ఆడటం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని తెలిపింది.
Gautam Gambhir : గంభీర్‌ను వీళ్లు చేసినంత ర్యాగింగ్ ఎవరు చేయలేరు.. ఒక్కోటి ఒక్కో డైమండ్..
లార్డ్స్ వేదికగానే ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరే అవకాశం లభించిందని, అయితే.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని అంది. గతాన్ని మరిచిపోయి ముందుకు సాగడమే ఓ ప్లేయర్ లక్షణమని అంది. ఏదీ ఏమైనప్పటికి కూడా దేశం తరుపున అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చింది.
ఇక టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 285 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాటర్లలో స్మృతి మంధాన (83; 108 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (58; 121 బంతుల్లో 7 ఫోర్లు), దీప్తి శర్మ (57; 87 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ (35) రాణించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ మూడు వికెట్లు తీసింది. లారెన్ ఫైలర్, ఇస్సీ వాంగ్, మాడీ విల్లయర్స్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. లారెన్ బెల్ ఓ వికెట్ సాధించింది.
ఆ తరువాత తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోయి 21 పరుగులు చేసింది. మాయా బౌచర్ (17), హెదర్ నైట్ (1)లు క్రీజులో ఉన్నారు.
