Sourav Ganguly Health : బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ హృదయ రక్తనాళాల్లో మూడు పూడికల్లో..మరొక దాంట్లో ఇవాళ స్టెంటును అమర్చనున్నారు. దాదా ఈసీజీ రిపోర్టులో స్వల్ప మార్పులు కనిపించడంతో..గత రాత్రి వైద్యులంతా కలిసి రెండో యాంజియోప్లాస్టీపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే…గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం అత్యంత నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యంపై దిగులుపడాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలోనే గుండెనొప్పితో బాధపడిన దాదా హృదయ రక్తనాళాల్లో మూడు పూడికలను గుర్తించారు.
ఒకదాంట్లో స్టెంట్‌ను అమర్చారు. ఆ తర్వాత ఆరోగ్యంగానే ఉండటంతో రెండో స్టెంట్ వేయడాన్ని వాయిదా వేశారు. అయితే బుధవారం గంగూలీ అసౌకర్యంగా ఉన్నారని, ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పడంతో కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. సీసీయూ 142 యూనిట్‌లో ఆయనను ఉంచి చికిత్స అందిస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులకు తెలిపారు వైద్యులు. ఆస్పత్రి వర్గాల ప్రకారం గంగూలీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ నివేదికలో స్వల్ప మార్పులు గుర్తించారని తెలిసింది. వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.