Steve Smith Captaincy : భారత్‌తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ కొనసాగనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో చివరి టెస్ట్ లోనూ ఆసీస్ జట్టుకు అతడే సారథ్యం వహిస్తాడు. అహ్మదాబాద్‌లో మార్చి 9 నుంచి ప్రారంభమయ్యే సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు కమిన్స్ స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే.
తన తల్లి అనారోగ్యం కారణంగా కుటుంబంతో కలిసి ఉండేందుకు అహ్మదాబాద్‌లో భారత్‌తో జరగనున్న నాల్గవ టెస్టుకు కమిన్స్ దూరమయ్యాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కష్ట సమయంలో కమిన్స్, అతడి కుటుంబానికి అండగా ఉంటామని, పూర్తి సహకారాన్ని అందిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లోని చివరి టెస్టులో తమ జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని వెల్లడించింది.
మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌కూ కమిన్స్ అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం. వన్డేల్లో కూడా స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. కమిన్స్ గైర్హాజరీతో ఆసీస్ క్రికెట్ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన స్మిత్.. మూడో టెస్ట్ మ్యాచ్ లో విజయాన్ని అందించాడు. ఈ టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
Also Read: హార్దిక్ పాండ్యా వస్తే బాగుంటుంది.. అదే నాకు అర్థం కావడం లేదు..
కాగా, మళ్లీ పూర్తిస్థాయి కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టడానికి తనకు ఆసక్తి లేదని స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. “కెప్టెన్‌గా నా సమయం ముగిసింది. ఇది ఇప్పుడు పాట్ జట్టు” అని 33 ఏళ్ల స్మిత్ వ్యాఖ్యానించాడు. కెప్టెన్‌గా ప్రపంచంలో తాను ఇష్టపడే ప్రదేశం భారత్ అని పేర్కొన్నాడు. 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదంతో కెప్టెన్సీ కోల్పోయి ఏడాది పాటు స్మిత్ నిషేధానికి గురైన సంగతి క్రికెట్ అభిమానులకు బాగా గుర్తుండే ఉంటుంది.
జే రిచర్డ్‌సన్ అవుట్
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ ఎడమ స్నాయువు గాయంతో ODI సిరీస్‌కు దూరమయ్యాడు. క్లబ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు అతడు గాయపడ్డాడు. రిచర్డ్‌సన్ స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు.