Sunil Gavaskar counter to Shahid afridi
Sunil Gavaskar : ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం చేయని సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా టీమ్ఇండియా ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీనిని తీవ్ర అవమానంగా పాక్ జట్టు మాజీలు భావిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ పై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఘాటుగా స్పందించాడు. పాక్ మాజీ ఆటగాడికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
గత కొన్నేళ్లుగా చూస్తే మీకే ఈ విషయం అర్థమవుతుంది. ఆటలు, రాజకీయాలు వేరు వేరు కాదని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇక్కడ తాను ఎవరినీ విమర్శించడం లేదన్నాడు. వారు తీసుకునే స్టాండ్ అలా ఉంటే తాను ఏం చేయలేనని చెప్పుకొచ్చాడు. రాజకీయాల గురించి చర్చించినప్పుడు అన్నీ అందులోకి వస్తాయన్నాడు.
టీమ్ఇండియా చేతిలో ఘోర ఓటమి తరువాత పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ప్రెజెంటేషన్ వేడుకకు రాని విషయాన్ని గుర్తు చేశాడు. అలా చేయడం వల్ల పెద్దగా ఏమీ ఒరగదని చెప్పాడు. గెలిచిన జట్టు కెప్టెన్ ఏం చెబుతాడా అనేది ప్రజలు ఆసక్తికరంగా వింటారన్నాడు. ఓడిపోయిన జట్టు గురించి అసలు పట్టించుకోరన్నాడు.
అఫ్రిది ఏమన్నాడంటే..?
సోషల్ మీడియాలో ఆసియాకప్ ప్రారంభం నుంచి బాయ్ కాట్ ప్రచారం జరిగిందన్నాడు. విపరీతమైన ఒత్తిడి వచ్చింది కాబట్టే భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేయలేదన్నాడు. ఈ విషయం తనను పెద్దగా ఆశ్చర్యపరచలేదన్నాడు. అయితే.. తన అభిప్రాయం ప్రక్రారం ఇది క్రీడా స్ఫూర్తి కాదన్నాడు. ఈ మెగాటోర్నీకి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో అందరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నట్లుగా అఫ్రిది తెలిపాడు.