Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. వరుసగా నాలుగు ఓటముల తరువాత పంజాబ్ పై విజయంతో ఎస్ఆర్‌హెచ్ గాడిన పడినట్లే కనిపించింది. అయితే.. ఏప్రిల్ 17న ముంబై ఇండియన్స్‌తో చేతిలో ఓడిపోవడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది.
ఇప్పటికే ఐపీఎల్ 2025 సీజన్ సగం పూర్తి అయింది. ప్లేఆఫ్స్ రేసులో ఎస్ఆర్‌హెచ్ చాలా వెనుకబడి ఉంది. ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలంటే ప్రతి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. ఈ క్రమంలో ముంబైతో తలపడనుంది. వాంఖడేలో తమకు షాకిచ్చిన ముంబైకు ఉప్పల్‌లో సన్‌రైజర్స్ షాకిస్తుందా? లేదా అన్నది చూడాల్సిందే.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 4 పాయింట్లు ఖాతాలో ఉండగా నెట్ రన్‌రేట్ -1.217గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.
మరోవైపు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి జోష్‌లో ఉంది ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు ఆ జట్టు 8 మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో ఎనిమిది పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ +0.483గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
హెడ్-టు-హెడ్..
ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు 24 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో ముంబై 14 మ్యాచ్‌ల్లో గెలవగా, 10 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ విజయం సాధించింది.
పిచ్..
ఉప్పల్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ఇప్పటి వరకు ఇక్కడ ఆడిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లే నమోదు అయ్యాయి. ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండడంతో నేటి మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బౌలర్లకు పెద్దగా సహకరించదు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 230 పరుగులు కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 186 పరుగులుగా ఉంది.
ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన 4 మ్యాచ్‌లలో రెండు మ్యాచ్‌లను తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించగా, మరో రెండు మ్యాచ్‌ల్లో లక్ష్యాన్నిఛేదించిన జట్టు విజేతగా నిలిచింది. దీంతో టాస్ అనేది కీలక పాత్ర పోషించకపోవచ్చు.
వాతావరణం..
మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. బుధవారం మ్యాచ్ రోజున గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉంటుందని ఆక్యూవెదర్ తెలిపింది. వర్షం పడే అవకాశాలు దాదాపుగా లేవు.