T20 World Cup 2021 : కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపు, సెమీస్ అవకాశాలు మెరుగు
టీ20 వరల్డ్ కప్ లో కీలక పోరులో వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా గెలిచింది. సెమీస్ అవకాశాలను మెరుగు పరుచుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆసీస్
- Naveen
- Published On : November 6, 2021 / 07:09 PM IST
T20 World Cup 2021 Australia Won
T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో కీలక పోరులో వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా గెలిచింది. సూపర్-12 దశను విజయంతో ముగించి సెమీస్ అవకాశాలను మెరుగు పరుచుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 16.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి చేధించింది. మునుపటి ఫామ్ అందుకున్న ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 56 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 9 ఫోర్లు ఉన్నాయి. మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 32 బంతుల్లో 53 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో హోసిన్, గేల్ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్ కీరన్ పొలార్డ్ 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ ఎవిన్ లూయిస్ 29, హెట్మెయర్ 27 పరుగులు సాధించారు. తమ కెరీర్ లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న గేల్ 15, బ్రావో 10 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో హేజెల్ వుడ్ 4 వికెట్లు తీశాడు. స్టార్క్, కమిన్స్, జంపా తలో వికెట్ పడగొట్టారు.
Obesity medicine : ఊబకాయం తగ్గించే ఇంజెక్షన్..ఎగబడుతున్న జనాలు..
ఈ విజయంతో ఆస్ట్రేలియా తన నెట్ రన్ రేట్ ను మరింత మెరుగుపర్చుకోవడమే కాకుండా, సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. సూపర్-12 దశలో ఐదు మ్యాచ్ లు ఆడిన ఆసీస్ 4 విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉంది. ఆసీస్ సెమీస్ చేరాలంటే… ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితం వచ్చేవరకు ఆగాల్సి ఉంటుంది.
సూపర్-12 దశలో 4 మ్యాచ్ లు ఆడి 3 విజయాలతో కొనసాగుతున్న దక్షిణాఫ్రికాకు కూడా సెమీస్ అవకాశాలు ఉన్నాయి. అయితే నేటి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓటమిపాలైనా, సాధారణ విజయం సాధించినా… మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా సెమీస్ లో అడుగుపెడుతుంది.
