T20 World Cup 2026 : శ్రీలంక చేతిలో ఓడిపోయినా.. సూపర్-8కు అర్హత సాధించేందుకు ఆస్ట్రేలియాకు మిగిలి ఉన్న ఏకైక దారి ఇదే?
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) శ్రీలంక చేతిలో ఓడిపోయి సూపర్-8 అవకాశాలను ఆస్ట్రేలియా సంక్లిష్టం చేసుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : February 17, 2026 / 08:57 AM IST
T20 World Cup 2026 after loss to Sri Lanka still Australia have a chance for Super Eight stage
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. సోమవారం పల్లెకెల్లె వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై శ్రీలంక విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ఆస్ట్రేలియా సూపర్-8 అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ ( 54; 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ట్రావిస్ హెడ్ (56; 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలు చేశారు. జోష్ ఇంగ్లిష్ (27), గ్లెన్ మాక్స్‌వెల్ (22) లు రాణించారు. శ్రీలంక బౌలర్లలో దుషన్ హేమంత మూడు వికెట్లు తీశాడు. దుష్మంత చమీర రెండు వికెట్లు పడగొట్టాడు. మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, కమిందు మెండిస్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం పాతుమ్ నిస్సంక (100 నాటౌట్; 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో కదం తొక్కడంతో 182 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కుశాల్ మెండీస్ (51; 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. పవన్ రాత్నాయక్ (28 నాటౌట్) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టోయినిస్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ విజయంతో శ్రీలంక సూపర్-8 బెర్తును ఖరారు చేసుకోగా.. ఆస్ట్రేలియా సూపర్-8 అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
ఆసీస్ సూపర్-8కి చేరాలంటే?
టైటిల్ ఫేవరెట్‌లలో ఒకటిగా టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ పై ఘన విజయం సాధించింది. అయితే.. అనూహ్యంగా రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో శ్రీలంక చేతిలో తప్పక గెలవాల్సి ఉండగా ఈ మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సూపర్-8 అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఇక గ్రూప్ స్టేజీలో తమ చివరి మ్యాచ్‌ను ఒమన్‌తో శుక్రవారం ఆసీస్ ఆడనుంది.
Rashid Khan : చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20 క్రికెట్‌లో ఏకైక బౌలర్..
ఆసీస్ పై విజయంతో గ్రూప్-బి నుంచి శ్రీలంక సూపర్-8కి అర్హత సాధించింది. మిగిలి ఉన్న ఒక్క స్థానంలో కోసం జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ పోటీపడుతున్నాయి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జింబాబ్వే +1.984 రన్‌రేటుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించి రెండు పాయింట్లు, +0.414 రన్‌రేటుతో మూడో స్థానంలో నిలిచింది. ఐర్లాండ్ కూడా మూడు మ్యాచ్‌ల్లో ఒక్క గెలుపుతో +0.150 నెట్‌రన్‌రేటుతో నాలుగో స్థానంలో ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఒమన్ సూపర్-8 రేసు నుంచి ఎప్పుడో నిష్క్రమించింది.
ఇక ఆస్ట్రేలియా సూపర్-8 అర్హత సాధించాలంటే.. జింబాబ్వే తమ చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా ఒమన్ పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అప్పుడు జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ ఖాతాల్లో నాలుగేసి పాయింట్లు ఉంటాయి. మెరుగైన రన్‌రేటు కలిగిన జట్టు సూపర్-8కి చేరుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కొంచెం కష్టమే.
