IND vs WI : కీలక మ్యాచ్ ముందు విండీస్ స్పిన్నర్ కామెంట్స్.. టీమ్ఇండియాను చూసి భయపడడం లేదు.. ఆ జట్టులో స్టార్లు లేరు..
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీస్ ఫైనల్ (IND vs WI) చేరుకోవాలంటే వెస్టిండీస్ పై తప్పక గెలవాల్సి ఉంది.
- Thota Vamshi Kumar
- Published On : February 28, 2026 / 04:42 PM IST
T20 World Cup 2026 Akeal Hosein key comments ahead of IND vs WI clash
- ఆదివారం భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్
- ఈ కీలక మ్యాచ్‌కు ముందు విండీస్ స్పిన్నర్ కామెంట్స్
- భారత్‌ను చూసి భయపడడం లేదు
IND vs WI : టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీస్ ఫైనల్ చేరుకోవాలంటే వెస్టిండీస్ పై తప్పక గెలవాల్సి ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా విండీస్‌తో భారత్ ఆదివారం తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు వెస్టిండీస్ స్పిన్నర్ అకేల్ హోసేన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమ్ఇండియాను చూసి తాము భయపడడం లేదని స్పష్టం చేశాడు.
గతంతో పోలిస్తే ప్రస్తుత భారత జట్టులో పెద్దగా సూపర్ స్టార్ లేకపోవచ్చు కానీ, జట్టు బలంగానే ఉందన్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే సూపర్ 8 మ్యాచ్ అభిమానులకు మంచి కిక్ ఇస్తుందన్నాడు.
భారత జట్టుతో ఆడడం అంత సులభం కాదన్నాడు. ప్రస్తుత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు లేకపోయినప్పటికి కూడా యువ ఆటగాళ్లు గెలవాలనే కసిలో ఉన్నారన్నాడు. సాధారణంగా యువ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రపంచ కప్ చక్కని వేదిక అని చెప్పాడు. కాబ్టటి ప్రతి ఒక్క ఆటగాడు కూడా పూర్తి శక్తి సామర్థ్యాల మేరకు రాణించేందుకు కృషి చేస్తాడని తెలిపాడు.
ప్రపంచకప్ ట్రోఫీని మరోసారి సొంతం చేసుకోవడమే ప్రస్తుతం తమ లక్ష్యం అని చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ గెలవాలంటే అన్ని జట్లను ఓడించాల్సి ఉంటుందని తమ కోచ్ చెప్పాడని అన్నాడు. కాబట్టి ఏ జట్టుతో ఆడుతున్నామనేది ముఖ్యం కాదని, అన్నింట్లను ఓడించి ప్రపంచకప్ గెలిచేందుకు శాయశక్తుల వెస్టిండీస్ జట్టు కృషి చేస్తుందన్నాడు.
రెండు సార్లు టీ20 ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన వెస్టిండీస్ జట్టు టీ20 ప్రపంచకప్ 2026లో మెరుగైన ప్రదర్శన చేయడంలో అకేల్ హోసేన్ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన అతడు 6 వికెట్లు తీశాడు. జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చిన 3 వికెట్లు తీశాడు. అయినప్పటికి కూడా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతడిని పక్కన బెట్టారు. ఈ మ్యాచ్‌లో విండీస్ ఓడిపోవడం గమనార్హం. ఈ క్రమంలో భారత్‌తో మ్యాచ్‌లో అతడు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.
