SL vs PAK : వర్షం పడి శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ రద్దైతే.. న్యూజిలాండ్‌కు లాభమా? నష్టమా? లంకతో పాటు ఇంటికెళ్లేది ఎవరంటే?
శనివారం శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య (SL vs PAK) జరగనున్న మ్యాచ్ ద్వారా మరో సెమీస్ బెర్తు ఖరారు కానుంది.
Who will go to semis if SL vs PAK match abandoned due to rain in T20 World Cup 2026
- నేడు పాక్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్
- వర్షం పడి మ్యాచ్ రద్దైతే న్యూజిలాండ్ పంట పండినట్లే
- పాక్ ఇంటికే
SL vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 దశ ఆఖరికి చేరుకుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌లో అడుగుపెట్టాయి. మరో రెండు స్థానాల కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. గ్రూప్-1లో భారత్, వెస్టిండీస్‌లు గ్రూప్-2లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌లో బెర్తు కోసం ఆరాటపడుతున్నాయి. ఆదివారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ద్వారా ఓ సెమీస్ బెర్తు ఖరారు కానుంది. అంతకన్నా ముందే నేడు (శనివారం ఫిబ్రవరి 28) శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ద్వారా మరో సెమీస్ బెర్తు ఖరారు కానుంది.
పాక్, కివీస్‌లలో సెమీస్‌కు వెళ్లేది ఎవరు?
గ్రూప్-2 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్‌కు చేరుకుంది. మిగిలిన ఒక్క స్థానం కోసం పాక్, కివీస్ పోటీపడుతున్నాయి. మూడు మ్యాచ్ ఆడిన కివీస్.. ఓ మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇంకో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆ జట్టు ఖాతాలో మూడు పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేటు (+1.390) కూడా మెరుగ్గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇక పాక్ విషయానికి వస్తే.. రెండు మ్యాచ్‌లు ఆడగా ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. నెట్‌రన్‌రేటు (-0.461) కూడా మైనస్‌లో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
కాగా.. శ్రీలంకతో కొలంబో వేదికగా నేడు జరగనున్న మ్యాచ్‌లో పాక్ విజయం సాధిస్తే అప్పుడు ఆ జట్టు ఖాతాలో మూడు పాయింట్లు వచ్చి చేరుతాయి. అప్పుడు కివీస్, పాక్ పాయింట్లు సమం అవుతాయి. అయితే నెట్‌రన్‌రేటు మెరుగ్గా ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. అయితే.. కివీస్ నెట్‌రన్‌రేటును పాక్ అధిగమించాలంటే.. మొదట బ్యాటింగ్ చేస్తే 64 పరుగుల తేడాతో, లక్ష్య ఛేదన అయితే 13.1 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది. అలా కాకుండా మామూలుగా గెలిస్తే మాత్రం కివీస్ సెమీస్‌లో అడుగుపెడుతుంది.
శ్రీలంక జట్టు ఎప్పుడో సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించడంతో ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడిపోయినా పోయేది ఏమీ లేదు. అయితే.. ఈ మెగాటోర్నీలో ఆ జట్టు ఆఖరి మ్యాచ్ కావడంతో విజయంతో వీడ్కోలు పలకాలని ఆ జట్టు భావిస్తోంది.
వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే..
టీ20 ప్రపంచకప్ 2026లో కొలంబో వేదికగా జరగాల్సిన కొన్ని మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దీంతో పాక్, శ్రీలంక మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయితే పరిస్థితి ఏంటి అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే.. ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయిస్తారు. అప్పుడు పాక్ ఖాతాలో రెండు పాయింట్లే ఉంటాయి. అదే జరిగితే మూడు పాయింట్లు ఉన్న కివీస్ సెమీస్‌లో అడుగుపెడుతుంది.
కాగా.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి లేదు. మ్యాచ్ జరిగితే పల్లెకెలెలో వర్షం పడే అవకాశం కేవలం ఒక్క శాతం మాత్రమే ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలియజేసింది. ఉష్ణోగ్రతలు 19 నుంచి 26 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
