MS Dhoni : మ్యాచ్‌లో దీన్ని గమనించారా? భార్య చేసిన పనికి పడి పడి నవ్వుకున్న ధోని.. పాపం సాక్షి ఇజ్జత్ మొత్తం పాయె!
ఇంగ్లాండ్ బ్యాటర్ ఔట్ అయ్యాడని ధోని (MS Dhoni) భార్య సాక్షి సంబురాలు మొదలుపెట్టింది.
- Thota Vamshi Kumar
- Updated on- March 6, 2026 / 09:50 AM IST
T20 World Cup 2026 MS Dhoni wife Sakshi miscued celebration during IND vs ENG semis match video viral
MS Dhoni : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ ఫైనల్ చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ చూసేందుకు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్, అతడి భార్య సాక్షితో కలిసి వచ్చాడు. వీఐపీ బాక్స్ నుంచి వీరు మ్యాచ్‌ను వీక్షించారు. వీరితో పాటు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, ఆయన భార్య రితికా సజ్దే కూడా మ్యాచ్‌ను వీక్షించారు.
కాగా.. ఈ మ్యాచ్ సమయంలో సరదా ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ జట్టు 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌ను జస్‌ప్రీత్ బుమ్రా వేశాడు. ఈ ఓవర్‌లోని ఓ బంతిని సామ్ కరన్ షాట్ ఆడగా బంతిని బుమ్రా పట్టుకున్నాడు. అయితే.. బుమ్రా బంతిని పట్టుకోకముందే బాల్ నేలను తాకింది.
బంతి నేలను తాకినట్లుగా గమనించని ధోని భార్య సాక్షి ఇంగ్లాండ్ బ్యాటర్ ఔట్ అయ్యాడని సంబురాలు మొదలుపెట్టింది. తన సీటులోంచి లేచి చప్పట్లు కొడుతూ ఎగిరి గంతులు వేసింది. వెనుకనే నిలబడిన ధోని తన దైన శైలిలో ఆమెను శాంతింప జేశాడు. అది ఔట్ కాదు కూర్చో అంటూ సైగ చేశాడు. దీన్ని చూసిన అందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
సాక్షికి క్రికెట్ గురించి పెద్దగా తెలియదు..
ధోని భార్య సాక్షి కి క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. ఈ విషయాన్ని మహేంద్ర సింగ్ ధోనినే ఓ సందర్భంలో చెప్పాడు. ఇంట్లో కూర్చోని తాను, తన భార్య కలిసి క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు జరిగిన ఓ సరదా ఘటనను చెప్పాడు.
మేం ఓ వన్డే మ్యాచ్ చూస్తున్నాం. ఆ మ్యాచ్‌లో బౌలర్ వేసిన ఓ బంతిని ఓ బ్యాటర్ క్రీజు దాటి ముందు వచ్చి కొట్టాలని చూశాడు. ఆ బాల్ వైడ్ గా వెళ్లింది. వెంటనే కీపర్ బంతిని అందుకుని వికెట్లను పడగొట్టాడు. అప్పుడు బ్యాటర్ క్రీజులో లేడు. స్టంపౌట్ అయ్యాడని ఫీల్డర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ ఇచ్చాడు. అప్పుడు సాక్షి నాతో ఇలా చెప్పింది. అతడు నాటౌట్.. కావాలంటే మీరు చూడండి అని అంది. మళ్లీ మాట్లాడుతూ.. వైడ్ బాల్ లో స్టంపౌట్ ఉండదు అని అంది.
అలా కాదు.. వైడ్ బాల్‌లో స్టంపౌట్ ఉంటుంది.. నోబాల్ అప్పుడు ఉండదు అని నేను చెప్పాను. అప్పటికే బ్యాటర్ నడుచుకుంటూ బౌండరీ లైన్ దగ్గరగా వెళ్లాడు. అప్పుడు సాక్షి మీకు ఏమీ తెలియదు.. కావాలంటే చూడండి థర్డ్ అంపైర్ అతడిని వెనక్కి పిలుస్తాడు అని అంది. మా సంభాషణ ఇలా కొనసాగుతుండగానే ఔటైన బ్యాటర్ వెళ్లిపోగా.. కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చాడు. అప్పుడు మళ్లీ సాక్షి మాట్లాడుతూ.. ఏదో తప్పు జరిగింది. అతడు నాటౌట్ అని అంది. అని ధోని చెప్పగా.. ఆ కార్యక్రమంలో ఉన్న వారంతా పడి పడి నవ్వారు.
