T20 World Cup 2026 PAK vs IRE Match abandoned without toss due to rain
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో ఎట్టిపరిస్థితుల్లో కూడా భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదని పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. భారత్‌తో మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తే అప్పుడు వారు సూపర్-8కి అర్హత సాధించాలంటే గ్రూప్ స్టేజీలో మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే.. వారి ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశం ఉంది.
కొలంబోలో ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఐర్లాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ కనీసం టాస్ కూడా పడకుండానే రద్దైంది. ఇప్పుడు ఇదే విషయం పాక్ జట్టును కలవరపెడుతోంది. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. టీమ్ఇండియా ఖాతాలో రెండు పాయింట్లు వచ్చి చేరుకుంటాయి. అదే సమయంలో పాక్.. యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ లపై విజయాలు సాధించాల్సి ఉంది.
90 శాతం వర్షం ముప్పు..
టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7 శనివారం నెదర్లాండ్స్‌తో ఆడనుంది. ఉదయం 11 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. అక్యూవెదర్ ప్రకారం ఆ రోజు కొలంబోలో 90 వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ మ్యాచ్ పూర్తిగా రద్దు లేదా ఓవర్ల కోతతో జరిగే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే.. అప్పుడు అది పాక్ నెట్‌రన్‌రేటు పై తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది.
యూఎస్ఏ, నమీబియా జట్లతో పాక్ ఆడే మ్యాచ్‌లకు ప్రస్తుతానికి ఎలాంటి వర్షం ముప్పు లేదు. ఇక్కడ నమీబియాతో మ్యాచ్‌లో పాక్ ఈజీగా గెలుస్తుంది. కానీ యూఎస్ఏ పై ఎలా ఆడుతుంది అన్నది కీలకం. గత టీ20 ప్రపంచకప్‌లో పాక్ జట్టు యూఎస్ఏ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా నెదర్లాండ్స్ మ్యాచ్ రద్దు అయి, యూఎస్ఏ చేతిలో ఓడిపోతే మాత్రం పాక్ గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టవచ్చు.
ఈ క్రమంలో వర్షం పడొద్దని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ జట్టును వరుణుడి టెన్షన్ పట్టుకుంది.