IND vs PAK
IND vs PAK : టీ20 వరల్డ్ కప్‌లో హైఓల్టేజ్ మ్యాచ్‌కు సర్వంసిద్ధమైంది. ఆదివారం కొలంబో వేదికగా ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే, ఈ మ్యాచ్ పూర్తిస్థాయిలో జరిగే అవకాశాలు లేనట్లుగా తెలుస్తోంది.
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈనెల 15న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య కొలంబో వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బైకాట్ చేసింది. టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ జట్టును ఐసీసీ తప్పించడంపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలుస్తూ భారత్ జట్టుతో జరిగే మ్యాచ్‌కు దూరంగా ఉంటామని పాకిస్థాన్ ప్రకటించింది. ఐసీసీ, శ్రీలంక క్రికెట్ బోర్డు రంగంలోకి దిగడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెనక్కి తగ్గింది. దీంతో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయింది. అయితే, తాజాగా.. ఈ మ్యాచ్‌కు మరో అడ్డంకి వచ్చే పరిస్థితి నెలకొంది.
ఆదివారం జరిగే పాకిస్థాన్ వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ వర్షార్పణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రకటన ఇప్పుడు క్రికెట్ అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
శ్రీలంక వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రత్యేక వాతావరణ బులెటిన్ వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ అల్పీపడనం ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగే కొలంబోలోని ప్రేమదాస స్టేడియం సమీపంలో కూడా ఉండదనుంది.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ రోజున మైదానాన్ని మబ్బులు కమ్మేసే అవకాశం ఉందని, వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. భారీ వర్షం కురిస్తే మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. నామమాత్రపు వర్షం పడితే ఓవర్లు తగ్గించి మ్యాచ్ ను నిర్వహించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షం కారణంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది.
వర్షం వస్తే ఏమి జరుగుతుంది?
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం వస్తే ఐసీసీ టీ20 నియమాలు వర్తిస్తాయి. వర్షం పడితే ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. చివరికి ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. అందుకు కూడా వీలుకానిపక్షంలో మ్యాచ్ ను రద్దు చేస్తారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. పాకిస్థాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ కాబట్టి.. ఈ మ్యాచ్ రద్దయినా రిజర్వ్ డేలు ఉండవు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.