T20 World Cup 2026 Suryakumar Yadav Comments after Team India beat West Indies
Suryakumar Yadav : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియా సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవడంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సంజూ శాంసన్ చాలా గొప్పగా ఆడాడని కితాబు ఇచ్చాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో రోస్టన్ చేజ్ (40), జేసన్ హోల్డర్ (37 నాటౌట్), రోవ్‌మన్ పావెల్ (34 నాటౌట్) లు రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు చెరో వికెట్ సాధించారు.
ఆ తరువాత సంజూ శాంసన్ (97 నాటౌట్; 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో 196 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇక మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. నిజంగా ఇది ఓ గొప్ప అనుభూతి అని అన్నాడు. తాము ఆడిన విధానం చాలా బాగుందన్నాడు. ఇది చావో రేవో మ్యాచ్ లాంటిది అని తెలుసునని, ఇలాంటి మ్యాచ్‌లో కుర్రాళ్లు తమ సత్తా నిరూపించుకున్నారన్నాడు.
ఓపికతో ఎదురుచూసే వ్యక్తులకు ఎల్లప్పుడు మంచే జరుగుతుందనే విషయాన్ని తాను ఎప్పుడూ చెబుతూ ఉంటానన్నాడు. సంజూ శాంసన్‌కు కూడా ఇదే విషయాన్ని చెప్పానన్నాడు. ఇక అతడు (సంజూ) జట్టులో లేనప్పుడు కూడా ప్రాక్టీస్‌లో ఎంతో శ్రమించేవాడని అన్నాడు. అందుకు తగిన ప్రతిఫలం పొందాడని చెప్పుకొచ్చాడు. అతడు జట్టును విజయపథంలో నడిపించాడని తెలిపారు.
భారత బౌలర్లు ప్రణాళికలను చక్కగా అమలు చేశారని అన్నాడు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మంచు కురుస్తున్న సమయంలో 200 పరుగులు చేధించవచ్చునని తెలుసునని అన్నాడు. బంతి బ్యాట్‌పైకి చక్కగా వచ్చిందన్నారు. ఇక చిన్న చిన్న భాగస్వామ్యాలతో బ్యాటర్లు ఆడిన తీరు మ్యాచ్ గెలిచేందుకు దోహదపడిందన్నాడు.
సెమీ ఫైనల్‌కు చేరుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. తొలి మ్యాచ్ నుంచి మేము ఆడిన విధానం చూసుకుంటే ఇందుకు మేము అర్హులం అని భావిస్తున్నాను అని సూర్య అన్నాడు. సెమీస్ మ్యాచ్ ముంబైలో ఇంగ్లాండ్‌తో జరగనుంది. దీనిపై మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంకా దాని గురించి ఆలోచించలేదు. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటాము. ముంబైకి వెళ్లాక అప్పుడు ఆ మ్యాచ్ గురించి ఆలోచిస్తాము. ఇక అంచనాలు ఎప్పుడూ ఉంటాయి. అయితే.. మైదానంలో ఏం చేయాలో మాకు బాగా తెలుసు అని. సూర్య తెలిపాడు.