T20 World Cupలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందే బలమైన జట్లతో భారత్ పోరాటం

టీ20 వరల్డ్ కప్ 2021 అక్టోబర్ 19 నుంచి ఒమన్ మరియు యూఏఈల్లో ప్రారంభం అవుతుంది.

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2021 అక్టోబర్ 19 నుంచి ఒమన్ మరియు యూఏఈల్లో ప్రారంభం అవుతుంది. టీమ్ ఇండియా అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో మొదటి మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. పాకిస్తాన్‌తో ఈ ముఖ్యమైన మ్యాచ్‌కు ముందు, టీమ్ ఇండియా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో, భారతదేశం మొదట ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో తలపడనుంది.

అక్టోబర్ 18వ తేదీన ఇండియా, ఇంగ్లండ్ మధ్య మొదటి వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. అనంతరం అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. పాకిస్తాన్‌తో లీగ్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియాతో ఆడటం భారత్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. అక్టోబర్ 24వ తేదీన పాకిస్తాన్‌తో భారత్ మొదటి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. అక్టోబర్ 31వ తేదీన ఇండియా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత నవంబర్ 3వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో భారత్ ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

ఈసారి టీమ్ ఇండియా కాకుండా న్యూజిలాండ్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్న గ్రూప్-Bలో భారతదేశం స్థానం పొందింది. ఈ గ్రూప్‌లో క్వాలిఫికేషన్ రౌండ్ తర్వాత, రెండు జట్లు సెమీస్‌కి వెళ్తాయి. టీ20 వరల్డ్ కప్ 2021 కోసం టీమ్ ఇండియా 15 మంది సభ్యుల జట్టును ఇప్పటికే ప్రకటించింది. ముగ్గురు ఆటగాళ్లను రిజర్వ్‌లో పెట్టింది. నాలుగు సంవత్సరాల తర్వాత రవిచంద్రన్ అశ్విన్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. శిఖర్ ధావన్‌కు చోటు దక్కలేదు.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, టీమిండియాకు సెమీస్‌ చేరే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. నాలుగో స్థానం కోసం దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ మధ్య పోటాపోటీ ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే, సెమీస్ చేరుతాయి అనుకుంటున్న రెండు టీమ్‌లతో వార్మప్ మ్యాచ్‌లు ఉండడంతో భారత జట్టుకు మంచి ప్రాక్టీస్ అవుతుందని అంటున్నారు నిపుణులు.

ట్రెండింగ్ వార్తలు