T20 World Cup Row ICC dead line to Bangladesh Cricket Board
ICC : ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. అయితే.. భద్రతా కారణాలను చూపుతూ ఈ టోర్నీలో తమ జట్టు ఆడే మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంక కు తరలించాలని ఐసీసీని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) పలు మార్లు కోరింది. లేదంటే తాము ఈ టోర్నీలో ఆడబోం అని బెదిరింపులకు దిగింది.
బీసీబీ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. మెగాటోర్నీకి ప్రారంభానికి మూడు వారాల కంటే చాలా తక్కువ సమయం ఉండడంతో ఇప్పటికిప్పుడు వేదికల తరలింపు సాధ్యం కాదని మరోసారి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక నిర్ణయం బీసీబీ చేతుల్లోనే ఉందని, మెగాటోర్నీలో ఆడతారో లేదో చెప్పాలని జనవరి 21 వరకు వారికి ఐసీసీ టైమ్ ఇచ్చినట్లుగా ఈఏఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫో తెలిపింది.
ఒకవేళ బంగ్లాదేశ్ గనుక టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంటే ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ ఈ మెగాటోర్నీలో ఆడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ‘శనివారం ఢాకాలో జరిగిన చర్చల సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గడువు విధించింది. ఈ వారంలో రెండు సార్లు బీసీబీ, ఐసీసీ ల మధ్య చర్చలు జరిగాయి.’ అని వెల్లడించింది.
టీ20 ప్రపంచకప్ 2026లో 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఐదేసీ జట్ల చొప్పున మొత్తం జట్లను నాలుగు గ్రూపులు విభజించారు. ఇటలీ, న్యూజిలాండ్, వెస్టిండీస్, నేపాల్‌లతో కలిసి బంగ్లాదేశ్ గ్రూప్ సిలో ఉంది. గ్రూపు దశలో కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఓ మ్యాచ్ ఆడనుంది.