సూర్య క్యాచ్‌పై మళ్లీ చెలరేగిన వివాదం.. సౌతాఫ్రికా స్పిన్నర్ వీడియో వైరల్.. ఓ ఆటాడుకున్న నెటిజన్లు..
సూర్య బౌండరీ లైన్ వద్ద పట్టిన క్యాచ్ ఎంత పాపులర్ అయ్యిందో అంతే వివాదాస్పదమైంది. ఈ క్యాచ్ పై సోషల్ మీడియాలో పెద్దెత్తున్న రచ్చ జరిగింది.
- Harish Thanniru
- Updated on- August 30, 2024 / 01:14 PM IST
Suryakumar Yadav
Suryakumar Yadav T20 World Cup 2024 Catch : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్ పోరులో సౌతాఫ్రికా జట్టును టీమిండియా జట్టు ఢీకొంది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కఠభరితంగా సాగింది. అయితే, చివరి ఓవర్లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా జట్టు విజయానికి కేవలం 16పరుగులు చేయాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయగా.. క్రీజులో ఉన్న మిల్లర్ మొదటి బంతినే భారీ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి ఎగిరి బౌండరీ బయట పడబోయే సమయంలో రాకెట్ వేగంతో దూసుకొచ్చిన సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్నాడు. సూర్య అందుకున్న అద్భుత క్యాచ్ తో టీమిండియా విజయం సాధించింది.
Also Read : IND vs NZ : భారత్‌తో టెస్టు సిరీస్.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం..
సూర్య బౌండరీ లైన్ వద్ద పట్టిన క్యాచ్ ఎంత పాపులర్ అయ్యిందో అంతే వివాదాస్పదమైంది. ఈ క్యాచ్ పై సోషల్ మీడియాలో పెద్దెత్తున్న రచ్చ జరిగింది. బంతిని అందుకునే క్రమంలో సూర్య బౌండరీ లైన్‌ను తాకడని పలువురు ఆరోపించారు. సౌతాఫ్రికా ప్లేయర్లు కూడా సూర్య క్యాచ్ పై సందేహాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా.. సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ ఓ వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేస్తూ సూర్య క్యాచ్ పై కామెంట్లు చేశాడు. తన పోస్టుకు షమ్సీ ఇలా వ్రాశాడు.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో క్యాచ్‌ని చెక్ చేయడానికి వారు ఈ పద్ధతిని ఉపయోగిస్తే అది నాటౌట్ చేయబడి ఉండేదని పేర్కొన్నాడు.
షమ్సీ పోస్టు చేసిన వీడియోను చూసిన నెటిజన్లు అతనిపై విమర్శలు గుప్పించారు. మీ బుద్ది మారదా.. అంటూ కొందరు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రీ ట్వీట్లు చేశారు. కామెంట్లపై స్పందించిన షమ్సీ.. వివరణ ఇచ్చాడు. ఈ వీడియో కేవలం జోక్ గానే పరిగణించాలి. ఎవరికైనా ఇది జోక్ అని అర్థంకాకపోతే నాలుగేళ్ల పిల్లవాడిలా మీకు నేను వివరిస్తాను అని షమ్సీ రాశాడు.
