Team India dominance in ICC Ranks
Team India dominance: భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన క్షణాలివి. టీమిండియా ఫ్యాన్స్ తలెత్తుకుని గర్వంతో కాలర్ ఎగరేసే టైమ్ వచ్చేసింది. తాజాగా జరుగుతున్న అంతర్జాతీయ వన్డే ప్రపంచకప్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ టాప్ లేపిన రోహిత్ సేన అంచనాలకు తగ్గట్టుగా ఆడుతోంది. టీమిండియా జోరు ఇలాగే కొనసాగితే వన్డే వరల్డ్ కప్ కచ్చితంగా గెలిచి తీరుతుందని అభిమానులతో పాటు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి గుడ్ న్యూస్ అందింది.
Mohammed Siraj, Shubman Gill
గిల్ ఘనత
వన్డే ర్యాంకుల్లో టీమిండియా యంగ్ పేయర్లు టాప్ లేపారు. బ్యాటింగ్ లో శుభమన్ గిల్, బౌలింగ్ లో హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ టాప్ లోకి దూసుకొచ్చారు. అతిచిన్న వయసులో నంబర్ వన్ స్థానాన్ని అందుకున్న ఘనత గిల్ సొంతమైంది. 24 ఏళ్ల ఈ యువ క్రికెటర్ అంచనాలకు మించి రాణించి త్వరగానే నంబర్ వన్ ర్యాంకు సాధించాడు. 950 రోజుల పాటు టాప్ లో కొనసాగిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంను కిందకు దించాడు. విరాట్ కోహ్లి 4, రోహిత్ శర్మ 6 ర్యాంకుల్లో ఉన్నారు.
Shubman Gill
ధోని తర్వాత గిల్
అంతేకాదు ఎంఎస్ ధోని తర్వాత వేగంగా నంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్న బ్యాటర్ గా గుర్తింపు పొందాడు. ధోని 38 ఇన్నింగ్స్ ఆడి టాప్ ర్యాంక్ సాధిస్తే.. గిల్ 41 ఇన్నింగ్స్ లో ఈ మైలురాయిని అందుకున్నాడు. మహ్మద్ సిరాజ్ ఇంతకుముందే టాప్ ర్యాంకుకు చేరుకున్నా ఎక్కువ రోజులు నిలబడలేకపోయాడు. వరల్డ్ కప్ లో రాణించి మళ్లీ నంబర్ వన్ ర్యాంక్ చేజిక్కించుకున్నాడు. ఈసారి ఎక్కువ రోజులు ఉండేట్టే కనబడుతున్నాడు. కుల్దీప్ యాదవ్ 4, బుమ్రా 8, మహ్మద్ షమీ 10 ర్యాంకుల్లో నిలిచారు.
Team India
టీమిండియా ఆధిపత్యం
ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. వన్డే, టెస్టులతో పాటు టీ20లోనూ టీమిండియా నంబర్ వన్ టీమ్ గా ఉంది. వన్డేలు, టెస్టుల్లో ఇండియా ప్లేయర్లు అగ్రస్థానంలో ఉన్నారు. టీ20 ర్యాంకుల్లో సూర్యకుమార్ యాదవ్.. బ్యాటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. టెస్టుల్లో ఆల్ రౌండర్, బౌలింగ్ విభాగాల్లో మనోళ్లే టాప్ లో ఉన్నారు. ఆల్ రౌండర్ ర్యాంకుల్లో రవీంద్ర జడేజా, బౌలింగ్ లో రవీంద్రన్ అశ్విన్ టాప్ లో కొనసాగుతున్నారు.
Also Read: మాక్స్‌వెల్ కు బై-రన్నర్‌ను ఎందుకు అనుమతించలేదు..? అలాగే ఎందుకు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది..?