Team India : మూడో టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్.. ఇక ఇంగ్లాండ్ పని ఈజీనే!
మూడో టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది.
- Thota Vamshi Kumar
- Published On : February 8, 2024 / 03:41 PM IST
Team India
Team India – Virat Kohli : మూడో టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో మొదటి రెండు టెస్టులకు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. మూడో టెస్టు నుంచి అతడు అందుబాటులోకి వస్తాడని భావించినప్పటికీ అది జరగడం లేదు. మరో రెండు మ్యాచులకు సైతం అతడు దూరం కానున్నాడు.
ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టుతో పాటు ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ సైతం కోహ్లీ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ఆరంభం కానున్న ఆఖరి, ఐదో టెస్టు మ్యాచ్‌కు అతడు అనుమానమేనని సమాచారం.
తొలి రెండు టెస్టు మ్యాచుల్లో బ్యాటర్ల నిలకడలేమీతో టీమ్ఇండియా ఇబ్బంది పడింది. ఈ క్రమంలో మూడో టెస్టుకు కోహ్లీ వస్తే కొంత వరకు సమస్య పరిష్కారం అవుతుందని భావించగా.. అతడు ఇప్పుడు సిరీస్ మొత్తానికే దూరం కానుండడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. అతడి భార్య అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కోహ్లీ ఆటకు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Rishabh Pant : ఎన్నోసార్లు గదిలోకి వెళ్లి ఏడ్చాను.. ఆసక్తికర విషయాలను పంచుకున్న రిషబ్ పంత్
Virat Kohli
కాగా.. కుటుంబ వ్యవహరాల విషయంలో ఓ ఆటగాడికి బీసీసీఐ ఎప్పుడు మద్దతుగా ఉంటుందని, ఎప్పుడు అందుబాటులోకి రావాలనేది పూర్తిగా ఆ ఆటగాడి ఇష్టం. ప్రస్తుతానికి ఉన్న అంచనా ప్రకారం ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కోహ్లీ ఆడడం అనుమానమే అని ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లు పలు ఆంగ్ల మీడియాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే.. గాయాలతో జట్టుకు దూరం అయిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) లో కోలుకుంటున్నారు. మూడో టెస్టుకు వీరిద్దరు అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరో వైపు రెండో టెస్టు మ్యాచ్‌కు సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వగా.. అతడు మూడో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు.
కాగా.. మొదటి టెస్టు మ్యాచులో ఓడిపోయిన భారత్ విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. ఐదు మ్యాచుల సిరీస్‌ను ప్రస్తుతానికి 1-1తో సమం చేసింది.
