Team India top 5 wins in the T20 World Cup history against Pakistan
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా (ఫిబ్రవరి 15) ఆదివారం కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ఈ మెగాటోర్నీలో రెండు జట్లు చెరో రెండేసి చొప్పున మ్యాచ్‌లు ఆడాయి. ఆయా మ్యాచ్‌ల్లో విజయం సాధించి నాలుగు పాయింట్లతో ఉన్నాయి. +3.050 నెట్‌రన్‌రేటుతో భారత్ గ్రూప్-ఏలో అగ్రస్థానంలో ఉండగా +0.932 నెట్‌రన్‌రేటుతో రెండో స్థానంలో పాక్ ఉంది. ఈ క్రమంలో ఆదివారం జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సూపర్-8కి అర్హత సాధిస్తుంది.
భారత్, పాక్ జట్లు ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఎనిమిది సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో ఏడు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. ఓ మ్యాచ్‌లో పాక్ గెలుపొందింది.
ఆదివారం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ తలపడనుండడంతో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో టాప్-5 జాబితాను ఓ సారి పరిశీలిద్దాం..
టీ20 ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్ విజేతగా భారత్ నిలిచింది. 2007లో జరిగిన నాటి టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో పాక్ పై భారత్ 5 పరుగుల తేడాతో గెలుపొంది తొలిసారి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించింది.
అనంతరం పాక్ 158 పరుగుల లక్ష్య ఛేదనలో 19.3 ఓవర్లలో 152 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ తరుపున గౌతమ్ గంభీర్ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీసింగ్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. జోగిందర్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను అత్యంత ఉత్కంఠ మధ్య జోగిందర్ శర్మ వేసి మిస్బా ను ఔట్ చేసి భారత్ కు ప్రపంచకప్‌ను అందించాడు.
2022 టీ20 ప్రపంచకప్ సూపర్ 12 రౌండ్‌లో భారత్, పాక్‌లు తలపడ్డాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇచ్చిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
IND vs PAK : భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌కు ముందు ఐసీసీ కీలక నిర్ణయం.. భారత్‌కు భారీ అడ్వాంటేజ్!
అనంతరం 160 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికి ఆ తరువాత అద్భుతంగా పుంజుకుని గెలుపొందడం విశేషం. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో రాణించాడు. అతడు హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో కొట్టిన రెండు సిక్సర్లను అభిమానులను ఎప్పటికి మరిచిపోలేరు.
2007 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో భారత్, పాక్‌లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు స్కోర్లు సమం కావడంతో బౌల్ అవుట్‌ను నిర్వహించారు. ఇందులో భారత్ 3-0 తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప (39 బంతుల్లో 50 పరుగులు) టాప్ స్కోరర్. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి సరిగ్గా 141 పరుగులే చేసింది. స్కోర్లు సమం కావడంతో బౌల్ అవుట్ నిర్వహించారు. వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్పలు స్టంప్‌లను పడగొట్టగా, పాక్ త్రయం యాసిర్ అరాఫత్, ఉమల్ గుల్, షాహిద్ అఫ్రిదిలు స్టంప్‌లను మిస్ చేశారు.
2024 టీ20 ప్రపంచకప్ గ్రూప్ స్టేజీలో భారత్, పాక్‌లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు పరుగుల తేడాతో పాక్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 119 పరుగులకే ఆలౌటైంది. రిషబ్ పంత్ 31 బంతుల్లో 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తరువాత జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో చెలరేగడంతో లక్ష్య ఛేదనలో పాక్ ఏడు వికెట్లు కోల్పోయి 113 పరుగులే పరిమితమైంది. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లతో రాణించాడు.
టీ20 ప్రపంచకప్ 2012 సూపర్ 8 రౌండ్‌లో భారత్, పాక్‌లు ఢీ కొన్నాయి. కొలంబోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.4 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో లక్ష్మీపతి బాలాజీ మూడు వికెట్లు తీశాడు. అశ్విన్, యువీలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 78 నాటౌట్) రాణించడంతో 129 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17 ఓవర్లలోనే ఛేదించింది.